calender_icon.png 18 January, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడ బ్యాటుతో..

09-09-2024 03:03:47 AM

  1. ఓడిన ఇండియా ఏ 
  2. రాహుల్ పోరాటం వృథా 
  3. నిప్పులు చెరిగిన బీ బౌలర్లు 
  4. హీరోగా ముషీర్ ఖాన్

బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఏ మీద ఇండియా బీ జట్టు 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో అసలు మొదటి ఇన్నింగ్సు స్కోరు వందైనా దాటుతుందా లేదా అనే స్థితి నుంచి ఇండియా బీ మ్యాచ్‌ను కైవసం చేసుకున్న తీరు అమోఘం. టాస్ ఓడిన ఇండియా బీ మొదటి ఇన్నింగ్సులో 94 పరుగులకే కీలకమైన మొదటి ఏడు వికెట్లు కోల్పోయినా కానీ ముషీర్ ఖాన (181) పట్టువదలని విక్రమార్కుడిలా ఎదురొడ్డి నిలిచి జట్టుకు 321 పరుగుల స్కోరును అందించాడు.

ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గిల్ బృందం 231 పరుగులకే చాప చుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా బీ 184 పరుగులు చేసి ఇండియా ఏ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కానీ ఇండియా ఏ బ్యాటర్లు తడబ్యాటుకు గురై కేవలం 198 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇండియా బీ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగే బంతులతో ఇండియా ఏ బ్యాటర్లు సవాల్ విసిరారు. ఇండియా బీ బౌలర్లలో యశ్ దయాల్ 3 వికెట్లు తీసుకోగా, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ చెరి రెండు, సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్‌తో మెరిశారు. 

ఢీలా పడ్డ ‘డీ’ జట్టు

ఇక మరో మ్యాచ్‌లో ఇండియా డీ జట్టు ఇండియా సీ మీద 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. శ్రేయస్ సేన విధించిన 232 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయిన రుతురాజ్ ఆర్మీ చేధించింది. ఇక రెండో రౌండ్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 12 నుంచి అనంతపురం వేదికగా జరగనున్నాయి. ఇండియా ఏ x ఇండియా డీ తో, ఇండియా బీ x ఇండియా సీతో తలపడనున్నాయి.