calender_icon.png 19 January, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3,5౦౦కోట్ల భారీ పెట్టుబడులతో.. గ్లోబల్ డేటా సెంటర్

19-01-2025 01:14:03 AM

  1. మీర్ఖాన్‌పేటలో ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు 
  2. ఎస్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ
  3. డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్
  4. రెండోరోజు సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బిజీబిజీ

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): డేటా సెంటర్లకు గమ్యస్థానంగా హైదరాబాద్ పరుగులు పెడుతోంది. ఈ ప్ర యాణంలో శనివారం మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌లో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్‌కు చెందిన ఎస్‌టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ముందుకొచ్చింది.

100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో ఏర్పా టు చేసే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్‌ను ఎస్‌టీటీ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబుతో కూడిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజు సింగపూర్ పర్యటన బిజీబిజీగా సాగింది. 

ఈ సందర్భంగా ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్‌పేటలో ఈ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ఎస్‌టీటీ కంపెనీ రాష్ర్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో పరిశ్రమల శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్‌టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ ఎంఓయూపై సంతకాలు చేశారు.

అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లోని ఎస్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఆఫీస్‌ను సందర్శించారు. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం ఈ ఒప్పందం జరిగింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డేటాసెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రణాళిక లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది.

హైదరాబాద్‌లో ఎస్‌టీటీ క్యాంపస్ ఏర్పాటుతో దేశంలోనే అతిపె ద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌టీటీ గ్రూపు ముందుకు రావడం, తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలను.. ప్రపంచస్థాయి అనుకూలతలను నిదర్శనమని చాటిచెబుతోంది.

ఈ కంపెనీ పదేండ్లలో మన దేశంలో ఒక గిగావాట్ సామర్థానికి విస్తరించాలనే లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. దశాబ్దంలో ఈ కంపెనీ దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

 గౌరవంగా భావిస్తున్నాం

తెలంగాణతో కలిసి పనిచేయటం గౌరవంగా భావిస్తున్నాం. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహకంగా ఉన్నాయి. ప్రభుత్వం అందించే సహకారంతో  ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన వంటి ఉమ్మడి లక్ష్యాలు నెరవేరుతాయి. 

 బ్రూనో లోపెజ్, 

ఎస్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈవో  

 ఏఐ ఆవిష్కరణల్లో హైదరాబాద్ కీలక పాత్ర

ప్రపంచానికి హైదరాబాద్ డేట్ హబ్‌గా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణల్లో హైదరాబాద్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్‌లోని హైటెక్  సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది.

 దుదిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి 

డేటా సెంటర్లకు హైదరాబాద్ రాజధాని 

రాష్ర్టంలో రూ.3,500కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్న ఎస్‌టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులకు నా అభినందనలు. త్వరలోనే హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుంది. ఎస్‌టీటీ గ్రూపు రావడం అనేది తెలంగాణలో ఉన్న ప్రపంచస్థాయి అనుకూలతలను చాటిచెబుతోంది. 

 ఎస్‌టీటీ గ్రూపుతో ఒప్పందం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి 

సెమీకండక్టర్ హబ్‌గా తెలంగాణ

  1. పెట్టుబడులు పెట్టండి
  2. సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్‌కు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఈ ఇండస్ట్రీకి తెలంగాణ హబ్ గా నిలవనుందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

శనివారం సింగపూర్ పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (ఎస్‌ఎస్‌ఐఏ)తో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు.  రాష్ర్టంలో సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపనకు అందుబాటులో ఉన్న అనుకూల పరిస్థితులను మంత్రి శ్రీధర్ బాబు వారికి వివరించారు.

రాష్ర్టంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సా హకాలను గురించి తెలిపారు. తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధానాలు సింగ పూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి. 

ఈ ఏడాది చివరలో హైదరాబాద్‌కు ఎస్‌ఎస్‌ఐఏ ప్రతినిధులు

సెమీకండక్టర్ పరిశ్రమను తెలంగాణకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానానికి ఏఎస్‌ఐఏ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సెమీకండక్టర్ల పరిశ్రమ ల పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు.

ఈ ఏడాది చివరలో సింగపూర్ నుంచి ఎస్‌ఎస్‌ఐఏ ప్రతినిధుల బృందం హైదరాబాద్ రానుంది. ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించనుంది. హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంలో ఈ రౌండ్‌టేబుల్ సమావేశం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు తోడ్పడనుంది.

తెలంగాణ- సింగపూర్ భాగస్వామ్యం రాష్ట్రానికి కొత్త ఉద్యోగాల కల్పనతో పాటు, ఆర్థికాభివృద్ధికి దోహదపడే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సమావేశంలో ఎస్‌ఎస్‌ఐఏ చైైర్మన్  బ్రియాన్ టాన్, వైస్ చైైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రెటరీ సీఎస్ చుహతో పాటు రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.