కొంతమంది ఎటువంటి డైట్ లేకుండా సులభంగా బరువు తగ్గుతారు. అయితే మరికొంతమంది ఎంత కష్టపడినా ఇంచ్ కూడా తగ్గరు. శరీరతత్వాన్ని బట్టి బరువు పెరగడం, తగ్గడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మంచి పౌష్టికాహారం తీసుకుంటారో.. అప్పుడే ఆటోమేటిక్‌గా శరీర బరువు నియంత్రణలోకి వస్తుంది. ఎంత తింటున్నాం? ఎలా తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? అనే మూడు విషయాల పట్ల జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.
రోజు పొద్దున్నే నిద్రలేచిన వెంటనే గోరు వెచ్చటి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా గోరువెచ్చటి నీరు తీసుకోవడం వల్ల పేగులోని మలినం బయటకు వెళ్తుంది. జీవక్రియ మెరుగుపడటంతో తిన్న ఆహారం సులభంగా అరిగి కొవ్వుగా మారదు. పేగులు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో శరీరం అంత సులభంగా కొవ్వు నిల్వకాదు. కాబట్టి పేగులని ఆరోగ్యంగా ఉంచుకునే ఆహారాన్ని తీసుకోవాలి.
భోజనం తర్వాత నీరు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా భోజనానికి ఒక 20 నిమిషాల ముందు గ్లాసు మంచినీళ్లు తీసుకోవాలి. దీనివల్ల పొట్టనిండినా అనుభూతి కలుగుతుంది. తినే ఆహారం కలర్ ఫుల్‌గా ఉండాలి అంటే అందులో అన్ని రకాల కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు వంటివి ఉండాలి. ఆహారాన్ని ఎప్పుడు కూడా కంగారుగా నోట్లోపెట్టుకొని గబగబా తినేయకూడదు..
నిదానంగా నమిలి తినాలి. అలా తినడం వల్ల ఆహారం సులభంగా అరుగుతుంది. పైగా నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి పొందుతారు. కాబట్టి తక్కువ తింటారు. రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కూల్ డ్రింక్స్‌కి వీలైనంత దూరం ఉండాలి. ఫ్రిడ్జ్‌లో ఉంచి తీసిన చల్లటి నీళ్లు కూడా తీసుకోకూడదు.
చక్కెర, ఉప్పు వంటివి వీలైనంత తక్కువగా తినాలి. భోజనం తిన్న తర్వాత ఒక 20 నిమిషాలు నడక అలవాటు చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకోవడం, లిఫ్ట్ బదులు మెట్లు వాడటం.. తేలికపాటి ఎక్ససైజులు చేసుకోవడం మన జీవన శైలిలో భాగం చేసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. శరీర బరువు అదుపులో ఉండటంతో పాటు హెల్తీగా ఉంటారు.