- మహిళల కోసం మినీ పారిశ్రామిక వాడలు
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విప్రో భాగస్వామి కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. హైదరాబాద్‌లో విప్రో సంస్థ కార్యకలాపాల పురోగతిని వివరించేందుకు శుక్రవారం సచివాలయంలో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రాఘవన్, మంత్రితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తమకు అవసరమయ్యే మానవ వనరులకు స్కిల్ యూనివర్సిటీలో స్వయంగా శిక్షణ (ఇండస్ట్రీ డ్రివెన్ ట్రెయినింగ్) ఇచ్చి ఉద్యోగాల్లో నియమించుకోవాలని సూచించారు. డా.రెడ్డీస్ ల్యాబ్స్ ఇదే తరహాలో 80 మంది యువతకు తమ అవసరాలకు తగినట్టు శిక్షణ ఇస్తోందని తెలిపారు. రాష్ర్టంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళల కోసం మినీ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
అక్కడి మౌలిక సదుపాయాలతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. సమావేశంలో విప్రో కార్పొరేట్ వ్యవహారాల ప్రతినిధి వినయ్ రావత్, టీజీఐఐసీ సీఈవో వీ మధుసూదన్ పాల్గొన్నారు.