calender_icon.png 17 October, 2024 | 5:01 AM

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం

17-10-2024 02:45:50 AM

నేడు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం

రాష్ట్రంలో ఐదురోజుల పాటు వర్షాలు

హైదరాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి): నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. ప్రస్తుతం వాయిగుండం పశ్చిమ దిశగా కదులుతూ..  నెల్లూరుకు ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్నదని చెప్పింది. గురువారం ఉదయానికి వాయుగుండం నెల్లూరు సమీపం లో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇదే సమయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ బంగాళాఖాతం లో కొనసాగిన ఆవర్తనం బుధవారం బలహీనపడినట్లు పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షా లు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ఏపీలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్

వాయుగుండం ఏపీలోని నెల్లూరు సమీపంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ చెప్పింది. తీరే దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రకాశం, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్పింది.