calender_icon.png 8 October, 2024 | 12:20 PM

విండీస్‌ను చితక్కొట్టారు

05-10-2024 12:00:00 AM

దక్షిణాఫ్రికా సునాయాస విజయం

4 వికెట్లతో రాణించిన లాబా

మహిళల టీ20 ప్రపంచకప్

దుబాయ్: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తన జర్నీని ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-బిలో భాగంగా శుక్రవారం వెస్టిండీస్ ఉమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసి ఆపై బ్యాటింగ్‌లో ఒక్క వికెట్ కోల్పోకుండా టార్గెట్‌ను ఛేదించి తొలి అడుగును దిగ్విజయంగా పూర్తి చేసింది.

టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. స్టఫానీ టేలర్ (44 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్యాంప్‌బెల్ (17), జైదా జేమ్స్ (15 నాటౌట్) పర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో లాబా 4 వికెట్లతో చెలరేగగా.. సీనియర్ ఆల్‌రౌండర్ మారిజన్ కాప్ 2 వికెట్లు పడగొట్టింది.

అనంతరం 119 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ లారా వోల్వార్ట్ (55 బంతుల్లో 59 నాటౌట్), తంజిమ్ బ్రిట్స్ (52 బంతుల్లో 57 నాటౌట్) అజేయ అర్థశతకాలతో జట్టును గెలిపించారు. బౌలింగ్‌లో మెరిసిన లాబాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా 

ఆసీస్‌తో శ్రీలంక.. బంగ్లాతో ఇంగ్లండ్

ప్రపంచకప్‌లో భాగంగా నేడు కూడా డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్-ఏలో శ్రీలంకతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన శ్రీలంకకు మ్యాచ్ విజయం కీలకం కానుంది. అయితే ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును ఓడించడం లంకకు సవాల్‌తో కూడుకున్న పని.

పాక్ చేతిలో ఓటమితో లంక ఒత్తిడిలో కనిపిస్తుండగా.. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న ఆస్ట్రేలియా విజయంతో టోర్నీని ఆరంభించాలని చూస్తోంది. ఇక రెండో మ్యాచ్‌లో గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్‌లో నెగ్గి జోష్ మీదున్న ఆతిథ్య బంగ్లా జట్టు మరో విజయంపై కన్నేయగా.. మాజీ చాంపియన్ అయిన ఇంగ్లండ్ విజయంపై ధీమాగా ఉంది.  

సంక్షిప్త స్కోర్లు

వెస్టిండీస్: 20 ఓవర్లలో 118/6 (స్టెఫానీ టేలర్ 44 నాటౌట్; లాబా 4/29),

సౌతాఫ్రికా: 17.5 ఓవర్లలో 119/0 (లారా 59 నాటౌట్, తంజిమ్ 57 నాటౌట్).