రిలయన్స్, ఓఎన్జీసీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుంది. దీనిపై గత కొంతకాలంగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో రిలయన్స్, ఓఎన్జీసీలకు భారీ ఊరట లభించి నట్లయయింది. దీంతో ఆయా కంపెనీల రిఫైనింగ్ మార్జిన్లు పెరగనున్నాయి.
పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్), క్రూడ్ ఉత్పత్తుల ఎగుమతులపై 2022 జులై 1 నుంచి కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఆయా కంపెనీలకు పెద్దఎత్తున లాభాలు వస్తుండడంపై విధించే పన్నునే విండ్‌ఫాల్ ట్యాక్స్‌గాపేర్కొంటారు. రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వం ఈ పన్ను రేట్లను సవరిస్తూ వచ్చింది.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర గత కొన్ని నెలలుగా 72-75 డాలర్ల మధ్య చలిస్తోంది. ఈ నేపథ్యంలో విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు చేయాలని కేంద్రం నిర్ణయానికొచ్చింది. దీంతో పాటు పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం విధిస్తున్న రోడ్డు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సును కూడా రద్దు చేసింది.