calender_icon.png 27 November, 2024 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊదే వాద్యం తిత్తి

27-11-2024 12:00:00 AM

తిత్తివాద్యం కొమ్ములవారు ఉపయోగిస్తారు. వీరు ఇత్తడి కొమ్ములను మోగిస్తూ, వీరణాల వంటి జోడు వాద్యాలను వాయిస్తూ కాటమరాజు కథ చెబుతారు. వీరు కులానికి మాదిగలు. కాని యాదవ కుల పురుషుడైన కాటమయ్య కథను గానం చేస్తూ ప్రదర్శన ఇస్తారు. వీరి వద్ద బందరు కలంకారీ పటం ఉంటుంది. దాని పొడవు సుమారు ఎనిమిది మీటర్లు, వెడల్పు నాలుగైదు మీటర్లు ఉంటుంది. వీరి వద్ద కాటమరాజు కథకు చెందిన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి.

వీరు యాదవుల అధికారిక చరిత్రని గానం చేస్తారు. ఎక్కువగా వరంగల్, ఖమ్మం, విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్నారు. శ్రుతికోసం, ప్రత్యేక శబ్దం కోసం తిత్తిని వాయిస్తారు. ఇది కూడా ఊదే వాద్యమే. దీనిని మాషక్ లేక తిత్తి అంటారు. మేక కాళ్ళతో సహా చర్మాన్ని మొత్తం ఊడదీసి తోలు సంచిలాగా కడతారు. దానికి అనుబంధంగా గాలిని నిలవచేయడానికి ఒక భాగం ఏర్పాటు చేస్తారు. ఈ భాగం కలిగిన సంచి ‘పుంగి’ వాద్యంలోని బుర్రలాంటిది.

ఈ తిత్తిని సంగీత వాద్యం గానే కాకుండా కట్టడాలకు పనిచేసే మేస్త్రీలు కట్టిన భాగాల్ని తడపడానికి సైతం ఉపయోగిస్తారు. ఈ తిత్తులలో నీరుపోసి పైకి తీసుకుపోతారు. దీనిని నీళ్ళు తాగడానికి వాడతారు. దీనిలో గాలి ఊది నీళ్ళలో మునిగి పోకుండా తేలడానికి ఉపయోగిస్తారు. అలా ప్రాణాలు నిలుపుకోవడానికి పనికి వస్తుంది. ఇకపోతే ఈ తిత్తికి ఒక కొసని గాలి ఊదడానికి వెదురు గొట్టం గట్టిగా బిగించి కడతారు.

రెండో కొసవైపు రెండు బద్ద గొట్టాలను బిగిస్తే ఊదే వాద్యం అవుతుంది. వెదురు గొట్టం ద్వారా గాలిని ఊది తిత్తిని గాలితో నింపుతారు. రెండో కొననున్న బద్ద గొట్టం రంధ్రాలను వేళ్ళతో మూసివేస్తారు. తెరుస్తుంటారు. అలా మూస్తూ తెరుస్తూ శబ్దాన్ని వెలువరిస్తారు. 

తిత్తివాద్యాన్ని వాయించేటప్పుడు కావలిసినంతగా నొక్కుతూ సంచిలోని గాలిని మెల్లిగా బయటకు పంపేస్తారు. ఈ వాద్యం బ్యాగ్ పైపర్ లాగా ఉంటుంది. ఇలాంటి వాద్యాలు తగ్గిపోతున్న కాలంలో ఇంకా ఖమ్మం జిల్లా కొమ్ముల వారు తయారుచేసి వాద్యంగా ఉపయోగించడం విశేషం.