calender_icon.png 16 April, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో అన్నదాత..!

16-04-2025 12:47:30 PM

పంటలన్నీ వర్షార్పణం!

విద్యుత్ లైన్ తెగిపడి వృద్ధురాలు దుర్మరణం

మానుకోట జిల్లాలో గాలివాన బీభత్సం 

జిల్లాలో 195.2 మిల్లీమీటర్ల వర్షపాతం

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district)లో మంగళవారం రాత్రి గాలి వాన బీభత్యాన్ని సృష్టించింది. జిల్లావ్యాప్తంగా 195.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యధికంగా డబ్బులు పేట మండలంలో 38.2, గూడూరులో 28.2, బయ్యారంలో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. అకాల వర్షం అన్నదాతలను తీవ్ర నష్టపరచగా, ఇనుగుర్తి మండల కేంద్రంలో విద్యుత్తు లైను తెగిపడి, విద్యుదాఘాతానికి గురై నాగేల్ల ఉప్పలమ్మ (65) అనే వృద్ధురాలు దుర్మరణం పాలైంది.

గాలివానకు విద్యుత్తు లైన్ తెగిపడి ఇంటిముందు పడగా, తెల్లవారుజామున ఉప్పలమ్మ బయటకు వెళ్ళగా విద్యుత్తు లైను తెగుపడ్డ విషయాన్ని గమనించక అడుగు వేయడంతో విద్యుదాఘాతానికి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఇక వివిధ గ్రామాల్లో అకాల వర్షం వల్ల మరోసారి పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను కేసముద్రం మార్కెట్ కు తెచ్చి యార్డులో ఓపెన్ కల్లంపై బాగా ఆరబెట్టి తెల్లవారితే విక్రయించేందుకు సిద్ధం చేసిన మొక్కజొన్న, ధాన్యం మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి పోయాయి.

తెల్లారితే విక్రయించి నగదుతో ఇంటికి వెళ్తామనే ధీమాతో ఉన్న అన్నదాతలు వర్షానికి తమ పంట ఉత్పత్తులు తడవకుండా కాపాడుకోవడానికి పడ్డపాట్లు చెప్పనలవి కానివి. వర్షానికి ధాన్యం, మక్కల రాశులపై కప్పుకున్న టార్పాలిన్లు గాలికి ఎగిరిపోవడంతో ఓపెన్ యార్డులో పోసుకున్న ధాన్యం, మక్కలన్ని దాదాపుగా తడిసిపోయాయి. మంగళవారం రాత్రంతా పంట ఉత్పత్తులను వర్షానికి దెబ్బతినకుండా కాపాడుకునే ప్రయత్నంలో రైతులు జాగారం చేయాల్సి వచ్చింది. తడిసిన ధాన్యం, మక్కలను తిరిగి ఆరబెట్టి.. విక్రయించడానికి మళ్లీ మార్కెట్లోనే నాలుగైదు రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాగా తడిసిన ధాన్యం, మక్కలకు ఆశించిన ధర కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని, ఎంతో కష్టపడి అందించిన పంటను అకాల వర్షం ‘నోటికాడి బుక్క’ లాగేసుకున్నట్లు చేసిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి తెచ్చిన దాన్యం తడిసిపోయింది. మరి కొన్నిచోట్ల నూర్పిడి చేసిన వరి కల్లాలు వర్షానికి తడిసి పోయాయి. పక్షం రోజుల్లోనే రెండుసార్లు అకాల వర్షం రావడంతో అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.