బండి టెన్త్ ఫెయిల్.. ఆయనకు లేఖ కూడా రాయరాదు!
బీజేపీ గెలిస్తే అంబేద్కర్ విగ్రహాలను పీకేస్తామంటరు
నా చివరి రక్తపుబొట్టు వరకు మీకు సేవచేస్తా
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావు
గోపాల్‌రావుపేట మండల ఏర్పాటుకు కృషి
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ
చొప్పదండి, మే 11: మీ ప్రాంత బిడ్డను.. అభివృద్ధి చేసి చూపిస్తాను. ఓటేసి గెలిపించండి అని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు విజ్ఞప్తిచేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సొంత ఊరు రామడుగు మండలం గుండి, గోపాల్‌రావుపేట గ్రామాల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి రాజేందర్‌రావు ప్రచారం నిర్వహించారు. గోపాల్‌రావుపేట బస్టాండ్ కూడలిలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలకగా, నాయకులు, కర్యాకర్తలు గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా రాజేందర్‌రావు మాట్లాడుతూ.. గత పదేండ్లుగా బీఆర్‌ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, బీజేపీ నుంచి బండి సంజయ్‌కుమార్ చెరోదఫా ఎంపీలుగా పని చేశారనీ, ఇప్పుడు స్థానికుడినైన తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. తన తండ్రి వెలిచాల జగపతిరావు చనిపోయే ముందు కరీంనగర్ ప్రజలకు సేవ చేయాలని తనతో ఒట్టు వేయించుకున్నట్టు గుర్తుచేశారు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడి ప్రజల కోసం చివరి రక్తపుబొట్టు వరకు సేవ చేస్తానని ప్రమాణం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పదేండ్లు అవకాశం కల్పిసే, మనకు ఒరిగింది ఏమీ లేదని, ఈ పదేండ్ల మోదీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హఠావో, తెలంగాణ బచావో అనే నినాదంతో కాంగ్రెస్‌ను గెలిపించారని.. ఇప్పుడు బీజేపీ హఠావో, భారత్ బచావో నినాదంతో బీజేపీని కూడా బండకేసి కొట్టే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఉత్తర కాశీ వారణాసి ఆలయాన్ని రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేశాడనీ, ధక్షిణకాశీ అని పిలిచిన నోటితో వేములాడ రాజన్న ఆలయానికి కనీసం ఐదు కొత్తలు కూడా ఇవ్వలేదని మోదీపై మండిపడ్డారు. బండి సంజయ్ పదో తరగతి ఫెయిల్ అయ్యాడనీ, తనకు ఒక్కలేఖ రాయరాదనీ, ఒక్క అధికారితో మాట్లాడేంత చాతుర్యం లేదని విమర్శించారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క సైనిక్‌స్కూల్, ఒక ట్రిపుల్ ఐటీని తీసుకురాలేని దద్దమ్మ అని బండిపై విరుచుకుపడ్డారు. దేశంలోని 543 మంది ఎంపీల్లో అతి తక్కువ ఎంపీ నిధులు ఖర్చు చేసిన ఘనుడు బండి సంజయ్ అని ఎద్దేవాచేశారు. బీజేపీ మళ్లీ గెలిస్తే అంబేద్కర్ విగ్రహాలను పీకేస్తామని ఆ పార్టీ నేతలే అంటున్నారని చెప్పారు. దద్దమ్మ కేసీఆర్ పదేండ్లు పాలించినా కేవలం లక్ష రూపాయలు రుణమాఫీ ఇచ్చేందుకు అపసోపాలు పడ్డాడని మండిపడ్డారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే చేతిగుర్తుకు ఓటేసీ తనను పార్లమెంట్‌కు పంపాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ఎంపీగా వెలిచాలను గెలిపించాలనీ, ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నమైన గోపాల్‌రావుపేట మండలం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు మోర భద్రేశం, ఎంపీపీ జవ్వాజి హరీశ్, ఎంపీటీసీలు నరేందర్‌రెడ్డి, శ్యాంసుందర్‌గౌడ్, జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి, వైస్ ఎంపీపీ పూరెల్ల గోపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.