calender_icon.png 6 November, 2024 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెప్టెన్సీకి విలియమ్సన్ టాటా

20-06-2024 01:25:30 AM

క్రైస్ట్‌చర్చి: న్యూజీలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. పరిమిత ఓవర్ల (వన్డే, టీ20) క్రికెట్‌లో కెప్టెన్‌గా కొనసాగబోనని విలియమ్సన్ బుధవారం స్పష్టం చేశాడు. 2024 సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తాను వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ఒక ఏడాది పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉండనున్న విలియమ్సన్ టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటానని చెప్పాడు.  కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ‘అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో జట్టును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడటానికి ఇష్టపడతాను. దీనికి నా నుంచి ఎప్పటికీ పూర్తి సహకారం ఉంటుంది. అయితే న్యూజీలాండ్ జట్టు వేసవి సమయంలో చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడనుంది.

దీంతో విదేశాల్లో ఫ్రాం చైజీ క్రికెట్ ఆడడం కోసమే సెంట్రల్ కాంట్రాక్ట్ తిరస్కరించా. కాంట్రాక్ట్ తిరస్కరించినప్పటికీ జాతీయ జట్టుకు అందుబాటులో ఉంటా. ఇక పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం నా సొంత నిర్ణయం. కెప్టెన్సీకి రాజీనామా చేసినంత మాత్రానా జట్టుకు దూరమైనట్టు కాదు. చిన్న గ్యాప్ మాత్రమే తీసుకుంటున్నా. తప్పకుండా బలంగా తిరిగివస్తా’ అని చెప్పుకొచ్చాడు. కాగా విలియమ్సన్ న్యూజీలాండ్ తరపున 100 టెస్టులు, 165 వన్డేలు, 93 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్‌గా విలియమ్సన్ 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టీ20ల్లో జట్టుకు నాయకత్వం వహించాడు.

కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌కు మంచి రికార్డు ఉంది. విలియమ్సన్ సారథ్యంలోనే న్యూజీలాండ్  జట్టు 2015, 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచింది. ఇక కివీస్ జట్టు సాధించిన ఏకైక ఐసీసీ టైటిల్ కూడా విలియమ్సన్ కెప్టెన్సీలోనే వచ్చింది. 2021లో తొలిసారి నిర్వహించిన ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను కివీస్ కైవసం చేసుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌లో న్యూజీలాండ్ ఘోర వైఫల్యంతో లీగ్ దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.