calender_icon.png 24 October, 2024 | 2:06 AM

తొడగొడతారా.. తడబడతారా!

24-10-2024 12:00:00 AM

నేటి నుంచే భారత్ న్యూజిలాండ్ రెండో టెస్టు

  1. కివీస్ కొమ్ములు వంచేందుకు రోహిత్ సేన సిద్ధం!
    1. తుది జట్టులో రాహుల్ అనుమానమే!
    2. పంత్‌కు ప్రమోషన్..
    3. లాథమ్ ఆర్మీకి చెక్ పెడతారా?

* లంకకు తలవంచిన కివీస్‌ను రోహిత్ సేన చెడుగుడు ఆడుకుంటుందని అంతా భావించారు. కానీ మొదటి టెస్టులో నమ్మశక్యం కాని ఆటతీరుతో దారుణ పరాజయం మూటగట్టుకున్న భారత్ నేటి నుంచి జరిగే రెండో టెస్టులో అయినా గాడిన పడాలని ఆశిద్దాం. 

విజయ క్రాంతి స్పోర్ట్స్ డెస్క్: నేటి నుంచి పూనే వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఇప్పటికే మొదటి టెస్టు ఓడి 0-1 తేడాతో వెనుకబడిన రోహిత్ సేన ఈ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయడంతో పాటు డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం పదిలం చేసుకోవాలని భావిస్తోంది.

ఎవరూ ఊహించని రీతిలో తొలి టెస్టులో పరాజయం పాలయిన.. రోహిత్ సేన పూనేలో ఎలాగైనా కివీస్ కొమ్ములు వంచాలని ఉవ్విళ్లూరుతోంది.  మూడంటే మూడే రోజుల్లో బంగ్లాకు చెమటలు పట్టించిన భారత్ కివీస్‌తో తొలి టెస్టులో అంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. అయినా గతాన్ని తవ్వుకుని ప్రయోజనం లేదనే రీతిలో గత స్మృతులను చెరిపేస్తూ పూనేలో మనోళ్లు రెచ్చిపోవాలని కోరుకుందాం. 

పంత్‌కు ప్రమోషన్..

వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌పంత్‌కు ప్రమోషన్ వచ్చింది. ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో పంత్ మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. మరో పక్క విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఎనిమిదో ర్యాంకులో, జైస్వాల్ నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నారు. 

గెలుపు కీలకం.. 

డబ్ల్యుటీసీ ఫైనల్ చేరుకునేందుకు భారత్ 4 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. భారత్‌కు ఇంకా 7 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రతి టెస్టూ కీలకమే. ఈ సిరీస్‌లో రెండు టెస్టులు, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 

కేన్ కంగారు.. 

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియ మ్సన్ నేటి నుంచి జరగ బోయే రెండో టెస్టుకు కూడా దూ రం కానున్నాడు. లంకతో సిరీస్ సమయంలో గాయపడ్డ కేన్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని బోర్డు ప్రకటించింది.  

వాతావరణం

పూనేలో వర్షం పడే అవకాశం లేదు. ఆకాశం తేటగా ఉండి.. 32 డిగ్రీల సెల్సియస్ మేర ఎండ కాసే అవకాశం ఉంది. నల్లమట్టి వల్ల పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. 

రికార్డులు

ఇక్కడ భారత్ ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడగా.. సఫారీల మీద ఇన్నింగ్స్ తేడాతో గెలవగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  

తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), పంత్, రాహుల్/సర్ఫరాజ్, జైస్వాల్, కోహ్లీ, జడేజా/సుందర్, అశ్విన్, బుమ్రా, సిరాజ్/ఆకాశ్‌దీప్, కుల్దీప్, గిల్ (ఫిట్‌గా ఉంటే)

విరాట్ జోరు చూపేనా.. 

ఐదేళ్ల కిందట ఇదే నెలలో పూనేలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ 254 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు. మరి సిరీస్‌లో వెనుకబడి ఉన్న నేపథ్యంలో విరాట్ పాత జోరును చూపుతాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే స్కోరు కోహ్లీ కెరీర్ బెస్ట్‌గా ఉంది. 

రాహుల్ అనుమానమే!

తొలి టెస్టు రెండు ఇన్నింగ్సుల్లో విఫలమైన సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు రెండో టెస్టులో చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోం ది. ఫామ్‌లో ఉన్న గిల్ గైర్హాజరీ నేప థ్యంలో తొలి టెస్టులో చోటు దక్కిం చుకున్న సర్ఫరాజ్ ఆ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుని సెంచ రీతో కదం తొక్కాడు. మరి రెండో టెస్టుకు గిల్ వస్తే రాహుల్‌కు చోటు కష్టంగానే కనిపిస్తోంది. సర్ఫరాజ్ ఖాన్ ఒక వేళ ఈ టెస్టు ఆడకపోతే మాత్రం రాహుల్‌కు చోటు ఖాయం.