calender_icon.png 14 December, 2024 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కంగారు’కు కళ్లెం వేస్తారా?

14-12-2024 12:38:28 AM

విజయక్రాంతి ఖేల్ విభాగం: ప్రతిష్టాత్మక బోర్డర్ ట్రోఫీలో తొలి టెస్టులోనే విజయం సాధించి శుభారంభాన్ని దక్కించుకున్న భారత్ తర్వాత గులాబీ బంతితో జరిగిన టెస్టులో దారుణ పరాజయం మూటగట్టుకుంది. నేటి నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. మరి ఈ టెస్టులో విజయం సాధించి తిరిగి గాడినపడాలని రోహిత్ సేనతో పాటు యావత్ దేశం కోరుకుంటోంది. మరి నేటి నుంచి మొదలు కానున్న మరో సమరంలో రోహిత్ సేన ఎటువంటి ప్రణాళికలను అమలు చేస్తుందో వేచి చూడాలి. రెండో టెస్టులో అంచనాలను అందుకోలేకపోయిన యువ పేస్ బౌలర్ హర్షిత్ రానాను తుది జట్టు నుంచి తప్పిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

మళ్లీ ‘మొదటికి’..

టీమిండియాను ప్రస్తుతం ఓపెనింగ్ సమస్య వేధిస్తోంది. తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ లేకపోవడంతో ఓపెనింగ్ చేసిన రాహుల్ జోడీ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా కానీ కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించి విజయవంతం అయింది. రెండో టెస్టు నాటికి రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనింగ్‌పై చర్చ జరిగింది. రోహిత్ శర్మ జట్టు కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి రాహుల్ జోడీనే కొనసాగించాడు. కానీ రెండో టెస్టులో అటు మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మతో పాటు.. ఓపెనింగ్ జోడీ కూడా పెద్దగా రాణించలేకపోయింది. దీంతో నేటి నుంచి జరిగే మూడో టెస్టులో ఎవరు ఓపెనింగ్ చేస్తారా? అని అంతా ఎదురుచూస్తున్నారు. 

వారిని కాచుకుంటేనే..

ఆస్ట్రేలియా పిచ్‌లు అంటే పేస్‌కు పెట్టింది పేరు. ప్రస్తుత జట్టులో కెప్టెన్ కమిన్స్‌తో పాటు స్టార్క్, హేజిల్‌వుడ్ లాంటి అరవీరభయంకర పేసర్లు ఉన్నారు. వీరితో పాటుగా స్పిన్నర్ లయన్ కూడా ప్రమాదకరమే. వీరిని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే భారత్ ఈ టెస్టులో పై చేయి సాధించడం వీలుపడుతుంది. మొదటి టెస్టులో హేజిల్ వుడ్, రెండో టెస్టులో స్టార్క్, కమిన్స్ బంతితో భారత్‌ను దెబ్బతీశారు. ఈ టెస్టులో కూడా వీరిని కాచుకుంటేనే భారత్‌కు ఆధిక్యం లభించే అవకాశం ఉంది. 

నితీశ్ మార్క్.. 

తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి తొలి రెండు టెస్టు ల్లో తన మార్కు చూపెట్టాడు. మొదటి టెస్టులో అందరూ విఫలమైన వేళ నితీశ్ బ్యాటుతో విలువైన పరుగులు చేశాడు. అంతే కాకుండా బంతితో ఓ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో టెస్టులో కూడా విలువైన పరుగులు సాధించిన ఈ తెలుగుతేజం తృటిలో అర్ధసెంచరీని చేజార్చుకున్నాడు. మరి నేటి నుంచి మొదలయ్యే మూడో టెస్టులో నితీశ్ ఎలా రాణిస్తాడో... 

కలవరపెడుతున్న కోహ్లీ.. 

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కలవరపెడుతున్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించిన కోహ్లీ.. అనంతరం జరిగిన రెండో టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు. మరి నేటి నుంచి జరిగే పోరులో ఎలా ఆడతాడో.. 

గబ్బా.. చాలా రోజుల వరకు 

ఆసీస్‌కు ఓటమే లేకుండా ఉన్న కంచుకోట. కానీ 20౨1లో భారత్ ఆ కంచుకోటను బద్దలు కొట్టింది. గబ్బాలో మాకెదురే లేదని జబ్బలు చరుచుకున్న కంగారూలను కంగారుపెట్టిస్తూ చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నాటి గబ్బా హీరో పంత్ మరోసారి మెరవాలని భారత్ గబ్బాలో గర్జించాలని కోరుకుంటూ...

పంత్ ప్రతాపంయాదుందా?

గబ్బా అనగానే భారత అభిమానులకు పంతే గుర్తుకు వస్తాడు. 2021లో ఓడిపోతామని అనుకున్న టెస్టును గెలిపించిన పంత్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆనాడు పంత్ చేసిన 89* నాటౌట్ పరుగులు ఆసీస్‌కు ఇప్పటికీ ఓ పీడకలే. గబ్బాలో మాకు ఎదురేలేదని జబ్బలు చరుచుకుంటూ తిరిగిన ఆసీస్‌కు అచ్చొచ్చిన మైదానంలో ఓటమి రుచి చూపించిన పంత్ ఆట అమోఘం. నేటి మ్యాచ్‌లో కూడా పంత్ మరోసారి మెరవాలని ఆశిద్దాం!

నేటి నుంచేమూడో టెస్టు1 సమానంగాఇరు జట్లుగబ్బా వేదికగాఆసీస్‌ను దెబ్బ తీస్తారా?2021 గుర్తు చేసుకుంటున్న భారత అభిమానులు