calender_icon.png 15 January, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉంచుతారా.. కూల్చుతారా?

14-07-2024 05:27:58 AM

  • ఎకరా కొని ఎకరన్నర స్థలంలో బీఆర్‌ఎస్ ఆఫీస్ నిర్మాణం 
  • రూ.వందకే గజం చొప్పున కేటాయించిన గత సర్కార్ 
  • ఆక్రమణపై నోటీసులు ఇచ్చిన అధికారులు

జనగామ, జూలై 13 (విజయక్రాంతి): జాతీయ రహదారి పక్కనే ఉన్న స్థలం.. మార్కె ట్లో ఎకరాకు రూ.రెండు కోట్లపైనే నడుస్తోంది. కానీ, అధికార అండదండలతో గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కేవలం గజానికి రూ.వంద చొప్పున చెల్లించి ఎకరా స్థలాన్ని అగ్గువకు కొట్టేసింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరో అర ఎకరం ఆక్రమించి సుందరంగా కార్యాలయ నిర్మా ణం చేపట్టింది. మొన్నటి వరకు ఆ పార్టీ అధికారంలో ఉండటంతో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా, అక్కడ సర్వే నిర్వహించిన అధికారులు, అర ఎకరం కబ్జాకు గురైనట్టు గుర్తించి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో కబ్జా పర్వం బయటకి వచ్చింది. ఆక్రమిత స్థలం లో నిర్మాణాన్ని అలాగే ఉంచుతారా.. కూల్చేస్తారా? అనే చర్చ స్థానికంగా నడుస్తున్నది. జనగామ మండలంలోని యశ్వంతపూర్ పరిధిలో జాతీయ రహదారి 163 పక్కనే బీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి 2019 లో ప్రభుత్వం ఎకరా స్థలాన్ని కేటాయించింది.

ఇందుకోసం అప్పట్లో రూ.4.8 లక్షలను ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ చెల్లించింది. ఈ స్థలానికి ఆనుకొని మరో 20 గుంటల స్థలం ఉండగా దాన్ని కూడా ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో 2022 లో పార్టీ కార్యాలయాన్ని స్వయంగా కేసీఆరే ప్రారంభించారు. సువిశాలమైన పార్కింగ్ సదుపాయంతో పాటు కాన్ఫరెన్స్ హాల్, అతిథులు, నేతలు కూర్చునేలా అత్యాధునిక హంగులతో ఓ భవంతి, కిచెన్ షెడ్‌తోపాటు తెలంగాణ ఉద్యమ, రైతాంగ సాయుధ పోరాట యోధుల విగ్రహాలతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో భూఆక్రమణలపై నిఘా పెట్టిన క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ అర ఎకరా స్థలం ఆక్రమించినట్టు తెలియడంతో అధికారులు 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ నాలుగు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే పల్లాకు నోటీసులు జారీ చేశారు. గడువు ముగియగానే కబ్జా వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఆక్రమిత స్థలంలో నిర్మాణాన్ని త్వరలోనే కూల్చేస్తారంటూ జోరుగా చర్చ జరుగుతోంది.