calender_icon.png 29 September, 2024 | 4:54 AM

‘చే’జేతులా అప్పగిస్తారా!

29-09-2024 02:47:14 AM

ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టింది ఆ పార్టీ మీద ప్రేమతోనో, అభిమానంతోనో కాదు.. మాజీ సీఎం కేసీఆర్‌పై కోపంతో అన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణను పదేళ్లపాటు పాలించిన కేసీఆర్ అధికారం కోల్పోవడంలో ఆయన చేజేతులా చేసుకున్న తప్పిదమే ఎక్కువగా ఉన్నది.

తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేసినప్పటికీ కొన్ని అంశాల్లో ప్రజల అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువ ఇవ్వకుండా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టాయి. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ పగ్గాలు చేపట్టేలా చేశాయి. ఎవరెమనుకున్నా కేసీఆరే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అవకాశం ఇచ్చారు.

అయితే ప్రసుత్తం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేసీఆర్ ఇచ్చిన అవకాశం పట్ల కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలనుకుంటుందో ఏమో అనిపిస్తుంది. హైడ్రా ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కేసీఆర్ నెత్తిన పాలు పోసేలా ఉన్నది. నాడు కేసీఆర్ అవలంబించిన ఒంటెత్తు పోకడలనే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైడ్రా ఉద్దేశం ఏదైనప్పటికీ.. దాని ద్వారా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రాతో వచ్చే సమస్యలను ముందస్తుగా గుర్తించడంలో ప్రభుత్వం విఫలమయిందని చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీనే చేజేతులా ప్రాణం పోసినట్టయ్యింది. ఆందోళనలో, ఆవేదనలో ఉన్న సామాన్యుల పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీకి అవకాశం కల్పించింది. బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌కు అవకాశమిస్తే.. హైడ్రాతో కాంగ్రెస్ పార్టీనే బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చేట్టు కన్పిస్తోంది.