19-09-2024 12:22:34 AM
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు కుదేలు
సంగారెడ్డి జిల్లాలో భారీ నష్టం
మిగిలిన పంటను కాపాడుకునేందుకు భగీరథ యత్నం
ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరపైనే ఆశలు
సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసు కొని కష్టపడి పండించిన పంట వరద పాలైంది. రైతులకు తీరాన్ని నష్టాన్ని మిగిల్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో సాగు చేసిన పతి పంట భారీగా దెబ్బతిన్నది. మరోవైపు ప్రతికూల పరిస్థితుల కారణంగా కొన్నిచోట్ల పత్తి కాయలు నేలరాలాయి. దీంతో దిగుబడులు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ చొరవ తీసుకుని స్వయంగా పంట కొనుగోలు ప్రక్రియ చేపట్టకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
జిల్లాలో సాగు విస్తీర్ణం ఇలా..
జిల్లాలోని ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో విస్తారంగా ఈ పంట సాగైంది. జిల్లావ్యాప్తంగా 1,95,454 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా, దీనిలో కొంతభాగం వర్షార్పణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వం సాకులేమీ చెప్పకుండా, మెరుగైన మద్దతు ధర ఇస్తుందని రైతులు ఆశిస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నాణ్యత అనే పేరుతో పత్తి నిర్ణయియించే ధరలో కోత విధిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఆ ధరకు మార్కెట్లకు పత్తిని తెచ్చి విక్రయించ లేక స్థానిక వ్యాపారులకు ఎంతోకంత రేటు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు.
తీరా మార్కెట్‌కు వచ్చాక తగ్గుతున్న ధరలు..
మార్కెట్‌కు పంట రాకముందు మంచి ధరలు ఉంటున్నాయని, తీర అన్నిచోట్లా పంట చేతికి వచ్చాక మార్కెట్ ధరలు పడిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. 2024లో ప్రభుత్వం ఇప్పటికే పత్తికి మద్దతు ధర ప్రకటించింది. మీడియం పత్తి రకానికి క్వింటాకు రూ.7,121, పొడవు పత్తికి రూ.7,521 నిర్ణయించింది. గతేడాది పత్తి చేతికి వచ్చిన సమయంలో తేమ పేరుతో సాకులు చెప్పి వ్యాపారులు క్వింటాకు రూ.7,200 నుంచి రూ.6,600 చొప్పున మాత్రమే రైతులకు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. కానీ, సీజన్ ముగిసే నాటికి ఆ ధర క్వింటాకు రూ.8,190 నుంచి రూ.9,900 వరకు పెరిగింది.
వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ అధికారుల అం చనా ప్రకారం ఈసారి 30 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నది. జాతీయ మార్కెట్‌లో ఇప్పటికే పత్తి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. అయినప్పటికీ పత్తికి మద్దతు ధర లభించని పక్షంలో సీసీఐ పంట కొనుగోలు చేయాల్సి ఉం టుంది. కానీ సీసీఐ ద్వారా పంట కొనుగోళ్లు చేపడితే మద్దతు ధర తక్కువగా వస్తుందని రైతులు ఉసూరుమంటున్నారు. నిబంధనల ప్రకారం పంటలో 8 శాతం తేమ ఉంటేనే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర వర్తిసుంది. కానీ ఈ సీజన్‌లో తేమ శాతం 10 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో సీసీఐ పేచీలు, సాకులు పెట్టి ధర తగ్గిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన పంట పెట్టుబడులు
పత్తి సాగుకు ఏటికేడు పెట్టుబడి పెరగుతుంది. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కూలీ ఖర్చులు కూడా ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో కూలీల కొరత ఏర్పడడంతో కొందరు రైతులు పత్తితీతకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రా, కర్ణాటక నుంచి వలస కూలీలను రప్పిస్తున్నారు. వారికి స్థానికంగా తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతున్నది.