calender_icon.png 29 April, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా

29-04-2025 12:34:45 AM

వరంగల్ సభలో హరీష్ రావు ఫొటో లేకుండా అవమానపరిచారు

సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

సిద్దిపేట, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు విమర్శించడం సిగ్గుచేటని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ అన్నారు.

సోమవారం సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అత్తు ఇమామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీని విలన్ అని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు అధికారం పోగానే మతిభ్రమించిందని అందుకే ఇట్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే ఇప్పటికీ కూడా రాష్ట్రం ఏర్పడేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కెసిఆర్ కుటుంబం సభ్యులతో కలిసి సోనియాగాంధీకి సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని మరిచిపోయారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీపై బీఆర్‌ఎస్  పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  బీఆర్‌ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే వరంగల్ లో సభ నిర్వహించిందన్నారు. వరంగల్ సభలో పార్టీ కోసం సేవ చేస్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును అవమానించేలా కనీసం ఫ్లెక్సీలో ఫోటో కూడా పెట్టకుండా హరీష్ రావును అవమానించారని చెప్పారు ఇంత జరిగిన సిద్దిపేట నాయకులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. అధికారంలోకి వస్తామని కలలు కనడం  మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యదారి మధు, పట్టణ యువజన అధ్యక్షులు గయసుద్దీన్, మైనార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీ హర్షద్, రాజు రెడ్డి, మాజీద్, దుర్గ ప్రసాద్, రవితేజ తదితరులు పాల్గొన్నారు