04-04-2025 12:18:38 AM
యాచారం, ఏప్రిల్ 3: పట్టా భూములపై కోర్టులో స్టే ఉండగా ఎలా హద్దురాళ్లను ఏర్పాటు చేస్తారని ఫార్మాసిటీ రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో బీఆర్‌ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం అసైన్డ్, పట్టా భూములను సేకరించి, పరిహారం సైతం అందజేశారు.
ఆ భూముల్లో సర్వే నిర్వహించి హద్దురాళ్లను ఏర్పాటు చేయడానికి ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్ప, రెవెన్యూ సిబ్బందితో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ కేవీపీ రాజు, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా ఇన్‌స్పెక్టర్ కృష్ణంరాజు 150 మంది పోలీస్ బలగాలతో హద్దురాళ్లను ఏర్పాటు చేయడానికి గురువారం వెళ్లారు. అధికారులను రైతులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పట్టా భూములపై కోర్టులో స్టే ఉందని, వాటి వద్దకు ఎలా వస్తారని అధికారులను ప్రశ్నించారు. అసైన్డ్ భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లను ఇస్తామని నేటి వరకు ఇవ్వలేదని, పొజిషన్ సైతం చూపలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే భూముల్లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కన్నీళ్లు పెట్టిన మహిళా రైతులుఫార్మాసిటీ కోసం తమ భూములు లాక్కుంటున్నారని మహిళా రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు కల్లిబొల్లి మాటలు చెప్పి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ రద్దు చేస్తామని మాట ఇచ్చి తప్పారని దుయ్యబట్టారు. మం త్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, తీన్మార్ మల్లన్న ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోవాలన్నారు. ఫార్మాసిటీని రద్దు చేసి తమ భూములను తమకు ఇవ్వాలని కోరుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.