calender_icon.png 25 November, 2024 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్డ్ బాండ్లు కొంటారా!

24-11-2024 12:00:00 AM

కొద్ది రోజులుగా బంగారం ధర వేగంగా పెరుగుతున్నది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్రబ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతల కారణంగా వచ్చే ఏడాది సైతం పుత్తడి ర్యాలీ కొనసాగుతుందంటూ గోల్డ్‌మాన్ శాక్స్‌తో సహా పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లు అంచనాల్ని వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే  బంగారంలో మదుపు చేయాలని పలువురు చూస్తుంటారు.

భౌతిక రూపంలో బంగారాన్ని కొంటే, దానిని తిరిగి అమ్మి, మార్కెట్ ధరను పొందడం కష్టసాధ్యం. అందుచేత గోల్డ్ ఈటీఎఫ్‌లు (ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) సావరిన్ గోల్డ్ బాండ్లలో (ఎస్‌జీబీలు) పెట్టుబడి చేస్తే విక్రయించేటపుడు లేదా వాటిని నగదుగా మార్చుకునేటపుడు సరైన ధర లభ్యమవుతుందని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నారు. 

స్టాక్ ఎక్సేంజీల్లోనూ ఎస్‌జీబీలను కొనవచ్చు

రిజర్వ్‌బ్యాంక్ జారీచేసిన సమయంలోనే వాటిలో పెట్టుబడికి అవకాశం ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. అలాగే వాటి లో పెట్టుబడి చేసిన తర్వాత బాండ్ల కాలపరిమితి ముగిసేంతవరకూ అట్టిపెట్టుకోవా ల్సిందేనన్న ఉద్దేశ్యంతో వాటి జోలికి వెళ్లరు. అలాగే ఆర్బీఐ జారీచేసిన సమయంలో పెట్టుబడి చేసే అవకాశాన్ని మిస్ అయినవారు తదుపరి ఎస్‌జీబీ సిరీస్ కోసం వేచిచూస్తుంటారు.

బాండ్లు తమ చెంత ఉండి డబ్బు అత్యవసరం ఉన్నవారు తనఖాలను (ఎస్‌జీబీలను బ్యాంక్‌ల్లో తనఖా చేసుకునే అవకాశం ఉంది) ఆశ్రయిస్తుంటారు. కానీ వాటిని స్టాక్ ఎక్సేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లోనే డీమ్యాట్ ఖాతాల ద్వారా కొనవచ్చు. లేదా అమ్మే అవకాశం ఉన్నది. 

లిక్విడిటీ చూడండి

ఎక్సేంజీల్లో ఎస్‌జీబీలను కొనాలనుకునే ఇన్వెస్టర్లకు వాటి లిక్విడిటీ లేదా ట్రేడింగ్ పరిమాణం కీలకం. పలు సిరీస్‌ల ఎస్‌జీబీల్లో లిక్విడిటీ తక్కువ. దానితో కొనుగోలు, అమ్మకం ధరలు తగిన శ్రేణిలో ఉండవు. రిఫరెన్స్ రేటు కంటే ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక లిక్విడిటీ కలిగిన బాండ్లు తగిన ధరకు లభిస్తాయి. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో అన్ని ఎస్‌జీబీల మూడు నెలల సగటు ట్రేడింగ్ పరిమాణం విలువ రూ.13.4 కోట్లు ఉన్నది. 

ప్రీమియం ధరలో ఎస్‌జీబీలు

2015 నుంచి ఇప్పటివరకూ 67 సిరీస్‌లుగా ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీచేసిం ది. ఒక్కో ఎస్‌జీబీ యూనిట్‌ను ఒక్కో గ్రాము బంగారంగా పరిగణించాలి. ఈ సిరీస్‌లన్నీ సెకండరీ మార్కెట్లలో లిస్టయ్యాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్నాయి.

రిజర్వ్‌బ్యాంక్ గోల్డ్ బాండ్లను జారీచేసినపుడు లేదా వాటి కాలపరిమితి ముగిసిన తర్వాత మదుపుదారులకు చెల్లించడానికి ధరను ఇండియన్ బులియన్ అండ్ జ్యువలర్స్ అసోసియేషన్  ప్రకటించే  15 రోజుల సగ టు పుత్తడి ధర ఆధారంగా (రిఫరెన్స్ ధర) నిర్ణయిస్తుంది. అందుచేత స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ఈ రిఫరెన్స్ ధరకు అనుగుణంగానే ఎస్‌జీబీలు ట్రేడవుతుంటాయి.

కానీ ఇటీవల కాలంలో గోల్డ్ బాండ్లు రిఫరెన్స్ రేటుకంటే 4 నుంచి 15 శాతం వరకూ ప్రీమియంతో ఎక్సేంజీల్లో చేతులు మారుతున్నాయి. ఇటీవల కొత్తగా బాండ్లు జారీకాకపోవడం, రానున్న రోజుల్లో కొత్త సిరీస్ గోల్డ్ బాండ్లు విడుదల కాకపోవచ్చన్న అంచనాలతో సెకండరీ మార్కెట్లో వీటికి డిమాండ్ పెరుగుతు న్నది. దీంతో రిఫరెన్స్ ధరకంటే ఈ బాండ్ల ధర మరింత పెరిగిపోతున్నది. 

ఉదాహరణకు ఎన్‌ఎస్‌ఈలో చురుగ్గా ట్రేడయ్యే ఎస్‌జీబీ 2022-23 సిరీస్-2 (2030 ఆగస్టులో మెచ్యూరిటీ)  ధర ఎన్‌ఎస్‌ఈలో నవంబర్ 22న  రూ.8,298 వద్ద ముగిసింది. అదే రోజున ఐబీజేఏ 999 స్వచ్ఛతగల బంగారం ధర రూ.7,779కాగా, దానికి 6.8 శాతం ప్రీమియంతో ఆ బాండు ధర పలికింది.

మరో చురుగ్గా ట్రేడయ్యే 2020-21 సిరీస్-2 (2028 ఆగస్టులో మెచ్యూరిటీ) ప్రస్తుతం రూ.8,049 వద్ద, 2019లో జారీ అయిన సిరీస్‌స-3 ఎస్‌జీబీ (2027లో మెచ్యూరిటీ) రూ.8,250 వద్ద ఉన్నాయి. భౌతిక బంగారం, గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు లేని పన్ను మినహాయింపు ప్రయోజనం ఎస్‌జీబీలకు లభించడం సైతం వీటికి డిమాండ్‌ను పెంచుతున్నదని విశ్లేషకులు చెపుతున్నారు. 

పన్ను మినహాయింపు అదనపు ప్రయోజనం

గోల్డ్ ఈటీఎఫ్‌లు, భౌతిక బంగారం కు లేని పన్ను ప్రయోజనాలు ఎస్‌జీబీలకు లభిస్తున్నాయి. ఈ బాండ్ల కాలపరి మితి 8 ఏండ్లుకాగా, మెచ్యూరిటీ తర్వాత పొందే సొమ్ముపై మూలధన లాభాల పన్న మినహాయింపు ఉన్నది. అలాగే ఎస్‌జీబీలను 5, 6, 7 ఏండ్లు ముగిసిన తర్వా త ఆర్బీఐ ఇచ్చే ముందస్తు విత్‌డ్రాయిల్ సదుపాయం ద్వారా పొందే డబ్బుకు కూడా మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఉన్నది.

కానీ ఆర్బీఐ విండో ద్వారా కాకుండా స్టాక్ ఎక్సేంజ్‌ల్లో విక్రయిస్తే వచ్చే మూలధన లాభా లపై పన్ను కట్టాల్సిందే. స్టాక్ ఎక్సేంజ్‌లో కొని, 12 నెలలలోపు విక్రయిస్తే స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్‌గా పరిగణిస్తారు. దానికి వ్యక్తిగత శ్లాబ్ రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి. ఎస్‌జీబీలను 12 నెలల తర్వా త ఎక్సేంజీల్లో విక్రయిస్తే 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.