18-04-2025 01:14:29 AM
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: గవర్నర్లు పరిశీలన కోసం పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్దిష్ట కాలపరిమితిలోపు ఆమోదించడమో లేదం టే తిప్పిపంపడమో చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ఆందోళనకరమైన పరిణామమని పేర్కొంటూ.. న్యాయమూర్తులు చట్టసభ సభ్యులుగా, కార్యనిర్వాహకులుగా, న్యాయస్థానాలు ‘సూపర్ పార్లమెంట్‌గా’ పనిచేసే ప్రజాస్వామ్యం దేశంలో ఎప్పుడూ ఉండకూడదని అన్నారు. గురువారం రాజ్యసభ ఇం టర్న్స్ 6వ బ్యాచ్‌ను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.
ఇటీవల సుప్రీం తన తీర్పు ద్వారా రాష్ట్రపతికి ఆదేశం ఇచ్చిందని, దేశం లో ఏం జరుగుతోంది? మనం ఎటువైపు వెళ్తున్నాం? అని ప్రశ్నించారు. న్యాయస్థానా లు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదని, అదే జరిగితే రాజ్యాంగంలోకి ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలను.. ప్రజాస్వామ్యశక్తులపై ఒక అణ్వాయుధాన్నే ప్రయోగించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు నిర్దిష్ట సందర్భాల్లో ఈ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సరిహద్దులు క్షీణిస్తున్నా యని ధన్‌ఖడ్ ఆందోళన వ్యక్తం చేస్తూ..రాష్ట్రపతి చేసిన ప్రమాణాన్ని సభికులకు గుర్తు చేశారు. ‘రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, కాపాడుతానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటా నని..” రాష్ట్రపతి ప్రమాణం చేసి ఇతరులకు భిన్నంగా, ఒక ప్రత్యేకమైన,
ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటారని ఉపరాష్ట్రపతి వివరించారు. ‘మీరు భారత రాష్ట్రపతిని ఏ ప్రతి పాదికన నిర్దేశిస్తారో మాకు తెలియదు.. రాజ్యాంగం ప్రకారం మీకు ఉన్న ఏకైక హక్కు ఆర్టికల్ 145(3) ప్రకారం రాజ్యాంగా న్ని అర్థం చేసుకోవడం మాత్రమే’అని స్ప ష్టం చేశారు.
దేశంలో మూడు సంస్థలు శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ.. వాటి పరిధిలో పనిచేసినప్పుడే ఉత్తమంగా వికసిస్తాయని, ఒకరి పరిధిలోకి మరొకరు చొరబడటం మంచిది కాదని ఆయన హితవు పలికారు.
సుప్రీంకోర్టు అసలేం చెప్పింది?
తమిళనాడు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై ఈనెల 8న జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవి తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని,
ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని తీర్పులో స్పష్టం చేసింది. అలాగే పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెల ల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది