calender_icon.png 26 November, 2024 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ అభివృద్ది కోసం పెద జీతగాడిలా పని చేస్తా

25-11-2024 10:42:01 PM

వనపర్తి (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ది కోసం పెద జీతగాడిలా పని చేస్తానని చెప్పడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారంగా అనుక్షణం అభివృద్ది కోసం పాటుపడుతున్నానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 229 మందికి సీఎం సహాయనిధి, 379 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను ఆయన స్థానిక నాయకులతో కలిసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడిచిన 10 ఏండ్లు అధికారాన్ని అనుభవించి ఒక్కసారిగా అధికారం పోయే సరికి ఏం చేయాలో అర్థం కాక, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎక్కడ పేరు వస్తుందోనన్న భయంతో కొడంగల్, కొండారెడ్డిపల్లికి వెళ్లి లొల్లి పెడుతున్నారన్నారు.

గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు మిత్తీలను కడుతూ అభివృద్దిని చేసుకుంటూ వెళ్లుతున్నామని ఎమ్మెల్యే వివరించారు. డిసెంబర్ 21వ తేదిన దాదాపు 150 కంపెనీలతో జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 600 మందికి ఉపాధి దొరికే అవకాశాలున్నాయని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 30వ తేదిన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని ఈ సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.