హిజాబ్ నిషేధం సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు స్టే
న్యూ ఢిల్లీ, ఆగస్టు 9: అమ్మాయిలకు తాము ధరించే దుస్తులను ఎంచు కునే స్వేచ్ఛ ఉండాలని.. దీనిపై విద్యాసంస్థలు బలవంతం చేయకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. క్యాంపస్‌లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్రలోని ఓ కళాశాల జారీచేసిన సర్క్యులర్‌పై సుప్రీం తాత్కాలిక స్టే విధించింది. కళాశాలలో హిజాబ్, బుర్ఖా, క్యాప్ వంటివి ధరించకూడదంటూ ముంబైలోని ఎన్‌జీ ఆచార్య అండ్ డీకే మరాఠీ కళాశాల ఇటీవల ఓ సర్క్యులర్ జారీచేసిం ది.
దీన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. కళాశాలకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గురువారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం..హిజాబ్ నిషేధంపై స్టే విధించింది. అమ్మాయిలు తిలకం ధరించటం, బొట్టుపెట్ట డాన్ని కూడా నిషేధిస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే తరగతి గదిలో పూర్తిగా ముఖం కప్పిఉంచే దుస్తులను అనుమతించకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు కళాశాల కోర్టును ఆశ్రయించవచ్చంది.