calender_icon.png 15 November, 2024 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేక్‌కు విదేశాంగ బాధ్యతలు దక్కేనా?

13-11-2024 02:19:35 AM

రూబియోకు విదేశాంగ శాఖ బాధ్యతలు! 

జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్ట్

వాషింగ్టన్, నవంబర్ 12: ట్రంప్ విజయం తర్వాత ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామికి ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు దక్కుతాయని అంతా భావించారు. కానీ ట్రంప్ ఆ బాధ్యతలను వివేక్‌కు ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. విదేశాంగ శాఖ బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తుల జాబితాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మార్కో రూబియోకు విదేశాంగ శాఖను కేటాయించే అవకాశం ఎక్కువగా ఉందని అమెరికా మీడి యా పేర్కొంది. మరికొన్ని వారాల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్ తన కార్యవర్గ కూర్పుపై ప్రస్తుతం దృష్టిసారించారు. 

ఎన్‌ఎస్‌ఏగా మైక్ వాల్ట్

జాతీయ భద్రతా సలహాదారుడి(ఎన్‌ఎస్‌ఏ)గా మైక్ వాల్ట్‌ను ట్రంప్ నియ మించా రు. ట్రంప్‌కు మైక్ నమ్మిన బంటు. 2020 ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ట్రంప్‌కు సహాయం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా అధ్యక్షుడు బైడెన్ భద్రతా దళాలను వెనక్కి పిలవడాన్ని హౌస్ ఆర్మ్‌డ్ సర్సీసెస్ కమిటీ చైర్మన్‌గా మైక్ తీవ్రంగా తప్పుపట్టారు. 

బార్డర్ గ్జార్‌గా టామ్ హోమన్

అమెరికాలోకి అక్రమంగా వలసలు వచ్చే వారిని కట్టడి చేయడమే లక్ష్యం అని పదే పదే చెప్పిన ట్రంప్ అందుకు సంబంధించిన చర్యలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా నే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా గతంలో విధులు నిర్వ ర్తించిన టామ్ హోమన్‌ను బార్డర్  గ్జార్‌గా నియమించారు. ఈ హోదాలో టామ్ హోమ్ సరిహద్దు భద్రతా విధానాలు, ఇమ్మిగ్రేషన్ పాలసీ అమలు తీరును పర్యవేక్షిం చనున్నారు. 

రికార్డు స్థాయిలో పెరిగిన బిట్‌కాయిన్ విలువ

ట్రంప్ విజయం తర్వాత బిట్ కాయిన్ విలువ అమాంతం పెరుగుతోంది. మంగళవారం దాని విలువ చరిత్రలో తొలిసారిగా ఏకంగా 90వేల డాలర్లకు చేరింది. అమెరికాను ఈ భూమ్మీద క్రిప్టో క్యాపిటల్‌గా మారుస్తానని ట్రంప్ తాజాగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ విలువ 89, 637  డాలర్ల(సుమారు రూ.75లక్షలు)కు చేరి రికార్డు సృష్టించింది. బిట్ కాయిన్ విలువ ఇదే ఊపులో పెరిగితే ఈ ఏడాది చివరి నాటికి దాని విలువ లక్ష డాలర్లు దాటొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదే సమయంలో ట్రంప్ యూరప్, చైనాలపై విపరీతమైన సుంకాలు విధించొచ్చనే వార్తల నేపథ్యంలో యూరో, యువాన్ ధరలు నేల చూపులు చూశాయి.

సెకండ్ ‘లేడీ’ తాతది మర్వలేని యాస

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఫిజిక్స్‌ను బోధించిన రామశాస్త్రి మనవరాలు ఉష అమెరికా ‘సెకండ్ లేడీ’గా వ్యవహరించనున్నారు. ఐఐటీ ఖరగ్ పూర్ పూర్వ విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామశాస్త్రితో తమకు ఏర్పడిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుం టున్నారు. 1954లో చోటు చేసుకున్న ఓ హాస్యాస్పద సన్నివేశాన్ని పూర్వ విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. రామశాస్త్రి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఫిజిక్స్ బోధించడంతోపాటు ఆజాద్ హాల్‌లో వార్డెన్‌గా కూడా పని చేశారట.

ఈ క్రమంలోనే మెస్ బిల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో విద్యార్థులు ఆగ్రహావేశాలకు లోనయ్యారట. జనరల్ బాడీ మీటింగ్‌లో ఇదే విషయాన్ని విద్యార్థులు ప్రస్తావించగా రామశాస్త్రి తన తెలుగుతో కూడిన ఇంగ్లిష్‌లో మాట్లాడి అందరినీ శాంతింప చేశారట. రైసూ, సాల్టూ, పెప్పరూ, వెజిటేబుల్సూ ఇలా అన్నీ ధరలు పెరిగిపోయాయి. ఏం చేయమంటారం టూ ఇంగ్లిష్ పదాలలో తెలుగును మిక్స్ చేసి మాట్లాడారట. దీంతో విద్యార్థులు శాంతించారని అలనాటి సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన యాస మూలంగా ప్రొఫెసర్ రామశాస్త్రితో ప్రేమలో పడ్డట్టు ఐఐటీ విద్యార్థులు తాజాగా పేర్కొన్నారు. 

భారతీయులకు తిప్పలు

స్టీఫెన్ మిల్లర్‌ను డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా తిరిగి నియమించాలని ట్రంప్ భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజం అయితే ట్రంప్ నిర్ణయం వేలా ది మంది భారతీయలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో మిల్లర్ వల్ల హెచ్1 వీసాదారుల జీవిత భాగస్వాములకు లభించే ఉపాధి అవకాశాలు తగ్గి పోయాయి. అప్పట్లో హెచ్1 వీసాదారులపై మిల్లర్ బహిరంగంగానే విమర్శ లు చేశారు.

భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలను దొంగిలిస్తున్నారని ఏకంగా ట్రంపే ఈ ప్రచారంలో ఆరోపించడం, దానికి అదనంగా మిల్లర్‌ను డిప్యూటీ చీఫ్ స్టాఫ్‌గా తిరిగి నియమించాలనుకోవడం వంటి పరిణామాలను చూస్తుంటే భారతీయులకు ఇబ్బందులు తప్పవని ఇట్టే అర్థం అవుతోంది.