calender_icon.png 22 December, 2024 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ అరెస్టయితే అగ్నిగుండం చేస్తారా?

22-12-2024 02:27:33 AM

  • కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు..
  • బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పితీరుతాం 
  • రెండు నెలల్లో భూభారతి చట్టం అమలు 
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

ఖమ్మం, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ఫార్ములా  ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ఆరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని ఆ పార్టీ నేతలు అనడం తగదని, కాంగ్రెస్ కార్యకర్తలు ఇదంతా చూస్తూ ఊరుకోరని బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పితీరుతారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు ఎండీవో కార్యాలయంలో శనివారం ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు.

డబ్బు అహంకారంతో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలని చూస్తే  కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని పేర్కొన్నారు. భూభారతి చట్టానికి ఆమోదం తెలిపేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి, ప్రభుత్వానికి  సూచనలు ఇస్తాడనుకుంటే  ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం విచారకరమ న్నారు. ఆయన ఆయన తొత్తులు అసెంబ్లీలో పుస్తకాలు విసిరారని మండిపడ్డారు. భూభారతి చట్టం వస్తే వాళ్ల బాగోతం పయటపడుతుందనే అసెంబ్లీలో గందరగోళం చేశారని ధ్వజమెత్తారు.

దళితుడని చూడకుండా స్పీకర్‌పై పుస్తకాలు విసిరి అవమానపర్చారని అన్నారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నాయకులు కల్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొత్త చట్టం తేవడం వారికి ఇష్టంలేకనే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రజల భద్రతకే భూభారతి చట్టం 

రాష్ట్రంలో ధరణి వచ్చినప్పటి నుంచి ప్రజల్లో అభద్రతా భావం ఏర్పడిందని మం త్రి పొంగులేటి అన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు భూభారతి చట్టాన్ని తాము తీసుకువస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు పూర్తి భరోసా ఇచ్చే విధంగా ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామన్నారు. ఈ చట్టం అమలులోకి రావడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాదా బైనామాలకు సంబంధించి 9 లక్షల 24వేల దరఖాస్తులను చట్టంలో ఎక్కడా  పొందుపర్చలేదన్నారు. వీ టిని తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. 

అర్హులందరికీ సొంతిల్లు కట్టిస్తాం 

రాష్ట్రంలో అర్హులైన  పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని  మంత్రి పొంగులేటి చెప్పారు. మోడల్ హౌస్‌ను పరిశీలించి తక్కువ ఖర్చు, నాణ్యతతో ఇల్లు ఎలా కట్టాలో పేదలు పరిశీలించి, వారి స్థలాల్లో నిర్మించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు.

కల్లూరు మండలంలో డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని, అదే విధంగా రెవిన్యూ డివిజన్ అధికారి కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రజల డిమాండ్ మేరకు నెల రోజల్లో కల్లూరు మున్సిపాలిటీని మంజూరు చేస్తామని చెప్పారు.  

ఎక్కువ ఇండ్లు కేటాయించాలి: ఎంపీ రఘురాంరెడ్డి 

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అదనంగా ఇండ్లు  కేటాయించాలని ఎంపీ రఘురాంరెడ్డి మంత్రి పొంగులేటిని కోరారు. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం కోరుకున్న ప్రజల రుణం తీర్చుకునే దిశగా పని చేస్తానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల  అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు, కల్లూరు ఆర్డీవో రాజేందర్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ హేమలత పాల్గొన్నారు.