గెలిస్తే అంతా బాగున్నట్టేనా?
ఈవీఎంలపై అంత అనుమానం ఎందుకు?
కేఏ పాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం
న్యూఢిల్లీ, నవంబర్ 26: ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పాల్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఎన్నికల్లో ఈవీఎంలను వాడడాన్ని రద్దు చేసి పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశా రు. విదేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ విధానాన్నే అనుసరిస్తున్నారని, మన దేశంలోనూ ఆ విధానాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, కాంగ్రెస్ నేతలు ఆరోపించారని పాల్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా దేశంలో వేల కోట్లు అవినీతి జరుగుతోందని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంచుతున్నారని, దీనిని ఆపివేయాలని పాల్ కోరారు. ఈ పిటిషన్‌నపై మంగళవారం జస్టిస్ విక్రమ్ సేథ్, జస్టిస్ వరాలేతో కూడిన ధర్మాసనం విచారించింది.
ప్రపంచదేశాలకు విరుద్ధంగా మన దేశంలో ఈవీఎంలను ఎందుకు వాడకూడదని సుప్రీం ప్రశ్నించింది. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని అంటున్నారని, ఓడిపోతే ట్యాంపర్ అయినట్లు ఆరోపిస్తున్నారని ధర్మాసనం పేర్కొన్నది. పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగితే అవినీతి తగ్గుతుందా అని ప్రశ్నించింది.