18-04-2025 12:04:50 AM
సూర్యాపేట,ఏప్రిల్17(విజయక్రాంతి): జిల్లాలో కేంద్రంలో ప్రైవేటు హాస్పటళ్లు పుట్టగొడుగుళ్ల పుట్టుకొస్తున్నాయి. వైద్యం పేరుతో అక్రమ సంపాదనకు అలవాటు పడిన అక్రమార్కులు అద్దె సర్టిఫికెట్లతో అనుమతులు తీసుకొని అర్హత లేని డాక్టర్లతో వైద్యం చేయిస్తున్నారు.
వీరికి తోడు ప్రభుత్వ హాస్పటళ్లలో పని చేస్తున్న వైద్యులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ను తుంగలో తొక్కుతూ సొంత హాస్పటళ్లను నిర్వహిస్తున్నారని గత నవంబంర్లో విజయక్రాంతి ప్రచూరించిన కథనం అక్షర సత్యమని రుజువైనది. ఈ విషయంపై నవంబర్లో అద్దెకు డాక్టర్ సర్టిఫికెట్ లు శీర్షికన జిల్లా కేంద్రంలో జరుగుతున్న హాస్పటల్ దోపిడిపై కథనం ప్రచురించాము.
కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఏలాంటి చర్యలు తీసకోకపోగా గత రెండు రోఉలుగా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు పలు హాస్పటళ్లలో తనిఖీలు నిర్వహించి హాస్పటళ్ల అక్రమాలను గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు నివేదక ఇస్తారని లె లుస్తోంది. ఇందంతా కండ్లకు కట్టునట్లు కనబడుతున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అల్లోపతి హాస్పిటల్ ఏర్పాటుకు డిఎంహెచ్ ఐ అనుమతి తప్పనిసరి. అనుమతుల కొరకు గర్నమెంట్ సర్వీస్ లో లేని క్వాలిఫైడ్ డాక్టర్ యొక్క మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, దానితో పాటు క్వాలిఫైడ్ సిబ్బంది దృవపత్రాలు, బయోమెడికల్ సర్టిఫికెట్, పొల్యుషన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్వి తప్పనిసరి.
నిబంధనల ప్రకారం అనుమతి తీసుకొని ఆసుపత్రిని నిర్వహించాల్సి ఉంటుంది. కాగా ఆసుపత్రిలో జరిగే ట్రీట్మెంట్ కు యాజమాన్యమే బాధ్యత వహించాలి. కనుక రోగికి చేసే ట్రీట్మెంట్ విషయంలో ఎటువంటి పొరపాట్లు, తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంలో 105 ప్రైవేటు ఆసుపత్రులు ఉండగా ఇందులో 57 హాస్పటళ్లు నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నాయని ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 57 లో 35 హాస్పటళ్లలో గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న కేవలం ఒకే డాక్టర్ తో నడుస్తున్నాయి. నిబంధన ప్రకారం ఇలా ఉండకూడదు. ఈ విషయాన్ని కౌన్సిల్ సభ్యులు దృవీకరించారని సమాచారం.
అద్దె సర్టిఫికెట్లతో ఆసుపత్రుల ఏర్పాటు
కొంతమంది వైద్యులు సంబంధిత ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేయనప్పటికీ కేవలం వారి సర్టిఫికెట్ ను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు హాస్పిటల్ పర్మిషన్ కొరకు అద్దెకు ఇచ్చారని ప్రచారం. దీంతో ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు ఒక ఆసుపత్రిని స్థాపించి ఒక ఉపాధిలా భావించి కనీస విలువలు పాటించకుండా వైద్యాన్ని వ్యాపారంలా మార్చడం జరుగుతుంది.
హాస్పిటల్ పర్మిషన్ కోసం సర్టిఫికెట్ ఇచ్చిన సంబంధిత వైద్యులు ఆ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో అనే విషయాన్ని పరిశీలించి, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే హాస్పిటల్ పై సంబంధిత వైద్యులపైన జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగటంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
సగానికి పైగా హాస్పిటళ్లలో ప్రభుత్వ వైద్యులే
గవర్నమెంట్ డాక్టర్ సర్వీస్ రూల్స్ జిఓ నెం. 119 ప్రకారం ప్రభుత్వ వైద్యులు కేవలం గవర్నమెంట్ డ్యూటీ వేళల తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ప్రైవేటు ప్రాక్టీస్ అంటే కేవలం కన్సల్టేషన్ ప్రాక్టీస్ మాత్రమే చేయాలి. గవర్నమెంట్ డాక్టర్ పని చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులలో అడ్మిషన్స్, ఆపరేషన్స్ చేయకూడాడు. గవర్నమెంట్ డాక్టర్ పేరు మీద హస్పిటల్ స్థాపించకూడదు.
బెడ్స్ ఉంటే పర్మిషన్ కొసం వారి సర్టిఫికెట్ ఇవ్వకూడడు. కానీ జిల్లా ఆసుపత్రులో పని చేసే కొంతమంది వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు హాస్పటల్ లో పనిచేస్తున్నారు. ఇలా పనిచేస్తున్న సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఏలాంటి చర్యలు లేవు
పలుమార్లు ఫిర్యాధులు వచ్చిన పట్టించుకోని అధికారులు
జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల తీరు పట్ల అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నా వైద్యశాఖ మాత్రం పట్టించుకోవడం లేదు. పలుమార్లు ఈ విషయాన్ని పత్రికల్లో ప్రచురించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆకస్మిక తనిఖీలు చేస్తూ రోగులకు అందుతున్న వైద్యం వారికి వేస్తున్న బిల్లుల పరిశీలిస్తే వారి దోపిడీ వెలుగు చూసే అవకాశం ఉంది. కాని అధికారులు సహితం అమ్ముడుపోతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ తనిఖీల తరువాతనైనా అధికారులు చర్యలు తీసుకుంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.