calender_icon.png 8 April, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రానికి ఫైర్‌స్టేషన్ వచ్చేనా?

08-04-2025 12:06:09 AM

  1. హామీగానే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు 
  2. పారిశ్రామిక కేంద్రంలో ఇబ్బందులు 
  3. సీఎం సలహాదారు ‘వేం’పైనే ఆశలు

మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఫైర్స్టేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీలు ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా అనేక అగ్ని ప్రమాద ఘటనల్లో ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి. అనేకమంది ఆర్థికంగా నష్ట పోతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కేసముద్రంలోనే ఉంది. ఇక్కడ అనేక వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏటా వేసవిలో ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాదం సంభవించి ఆస్తి నష్టం భారీగా జరుగుతోంది. 

2౦ కిలోమీటర్ల నుంచి రావాల్సిందే

కేసముద్రంలో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబాబాద్ నుంచి ఫైర్ ఇంజన్ రావాల్సి ఉంది. సుమారు అరగంట నుంచి 45 నిమిషాల సమయం ఘటనస్థలికి చేరుకోవడానికి పడుతుండటంతో నష్ట నివారణకు ఆటంకంగా మారుతోంది.

కేసముద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు అనేకసార్లు ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కేసముద్రం రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో గత ప్రభుత్వ హాయంలో ఫైర్స్టేషన్ ఏర్పాటుకు స్థల సేకరణ కూడా చేశారు. దీనితో ఇక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తారని అంతా భావించినా.. ఆ ప్రతిపాదన మళ్లీ మూలకు పడింది.

ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల కేసముద్రంలోని వివిధ మిల్లుల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో రూ.లక్షల ఆస్తి నష్టం సంభవించింది. కేసముద్రంలో ఫైర్ స్టేషన్ ఉంటే నష్ట నివారణకు కొంత దోహదపడేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు పెద్ద ఎత్తున పత్తి, మిర్చి విక్రయానికి వస్తుంది. అలాగే ఇక్కడ వివిధ రకాల వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి.

చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించినా పెను ప్రమాదం చోటు చేసుకుంటుంది. జిన్నింగ్ మిల్లుల్లో అగ్ని ప్రమాద నివారణ యంత్రాలు ఉన్నప్పటికీ, ఫైర్స్టేషన్ లేకపోవడం వల్ల ఇతర పరిశ్రమలకు పెనుముప్పుగా మారింది. గతంలో కార్తికేయ మిల్లులో జరిగిన అగ్ని ప్రమాదంలో మిల్లు పూర్తిగా బుగ్గి అవ్వగా, ఇటీవల ఓ రైస్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇలా ప్రతి వేసవిలో ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాదం జరగడం నిత్య కృత్యంగా మారింది. 

సీఎం సలహాదారు చొరవతోనైనా..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ్పర్పడిన తర్వాత ఫైర్స్టేషన్ ఏర్పాటుపై స్థానికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కేసముద్రం మండలం అర్పణపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి.. సీఎం రేవంత్రెడ్డి సలహాదారుగా ఉండటంతో కేసముద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అవుతుందని భావిస్తున్నారు.

నరేందర్ రెడ్డి చొరవతో ఇప్పటికే కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటుకావడం, 50 పడకల ఆసుపత్రితోపాటు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరయ్యాయి. ఈ క్రమంలో ఫైర్స్టేషన్ కూడా ఏర్పాటు చేయిస్తే కేసముద్రం పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో అగ్ని ప్రమాద ఘటనల్లో ఆస్తి నష్టం జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని ప్రజలు అంటున్నారు.