- 24 మంది ఉద్యోగుల పేరిట రుణాలు
- రూ.4.50 కోట్లు సొంత ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్
- సూర్యాపేట ఎస్బీఐ మేనేజర్ నిర్వాకం
- ఏప్రిల్ 29న అరెస్ట్ చేసిన పోలీసులు
- రెండు రోజుల్లో విచారణకు సూర్యాపేటకు?
సూర్యాపేట, జూలై4 (విజయక్రాంతి): కంచే చేను మేసిన చందంగా పనిచేస్తున్న బ్యాంక్‌నే బురిడీ కొట్టించిన ఓ ప్రబుద్దుడు. 24 మంది ఉద్యోగుల పేరిట రూ.4.50 కోట్ల రుణాలు మంజూరు చేసి, నగదును సొంత ఖాతాలోకి మళ్లించుకోగా అడ్డంగా దొరికిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో పరారీలోకి వెళ్లగా, గత నెల 29న ఆయనను అరెస్ట్ చేసిన పోలీస్‌లు చెంచల్‌గూడ జైలుకు తరలించారు. రెండు రోజుల్లో విచారణ నిమిత్తం సూర్యాపేట పట్టణానికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అయితే, విచారణ చేసిన పిదప ఆయన తీసుకున్న రుణాలన్నీ రికవరీ చేస్తారా అని పట్టణంలో చర్చ జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేటలోని నేషనల్ హైవే పక్కన గల ఎస్బీఐ శాఖలో షేక్ సైదులు మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో అన్ని అర్హతలు కలిగి ఉండి బ్యాంక్‌లో రుణం కోసం వచ్చిన ఉద్యోగులను సాంకేతిక కారణాలు చూపుతూ దరఖాస్తులను తిరస్కరించేవాడు. అదనపు పత్రాలు తేవాలని వెనుకకు పంపేవాడు.
తదుపరి అదే దరఖాస్తు ఆధారంగా రుణం మంజూరీ చేసినట్టు బ్యాంక్ రికార్డుల్లో పొందుపర్చాడు. ఒక్కో దరఖాస్తుదారుడి పేరుపై రూ.15 లక్షల వరకు మొత్తం 24 మందికి రూ.4.50 కోట్లు మంజూరుచేసి తన సొంత ఖాతాలోకి మళ్లించాడు. విషయం ముందుగానే ఉద్యోగులకు తెలిసినట్టు సమాచారం.
వెలుగులోకి ఇలా..
ఉద్యోగుల పేరుతో రుణాలు తీసుకున్న మేనేజర్ సైదులు నిరుడు బదిలీపై హైదరాబాద్‌లోని సీసీజీ (కమర్షియల్ క్లయింట్ గ్రూప్) మేనేజర్‌గా వెళ్లాడు. కాగా, సూర్యాపేటలో తాను తీసుకున్న రుణాలకు ప్రతి నెలా ఇన్‌స్టాల్‌మెంట్లను కడుతూ వస్తున్నాడు. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్ కట్టకపోవడంతో ఉద్యోగులకు నోటీస్‌లు వచ్చాయి. దీంతో వారు సూర్యాపేట పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. కాగా, ఏప్రిల్ 29న అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు పంపించారు.
ఇదే తరహాలో మరికొన్ని చోట్ల
24 మంది ఉద్యోగుల పేరిట రూ.4.50 కోట్లు అక్రమంగా తీసుకున్న మేనేజర్ సైదులు అంతటితో ఆగకుండా ఇదే తరహాలో మరికొన్ని చోట్ల తప్పుడు మార్గాలను అనుసరించినట్టు తెలుస్తుంది. రామంతాపూర్ బ్యాంక్ మేనేజర్‌తో కలిసి రూ.2.5 కోట్లు, సికింద్రాబాద్ శాఖ నుంచి రూ.10 కోట్లు కాజేసినట్టు సమాచారం.
రెండు రోజుల్లో విచారణ
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న సైదులును మరో రెండు రోజుల్లో ఈ కేసును విచారించేందుకు సూర్యాపేటకు తీసుకకురానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే అధికారులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణలు చేసి అతడు అక్రమంగా తీసుకున్న రుణాల నగదును రికవరీ చేసి, తమకు న్యాయం చేయాలని బాధితులు ఎదురు చూస్తున్నారు.