calender_icon.png 4 October, 2024 | 8:48 AM

ఆర్యోగ బీమాపై పన్ను తగ్గుతుందా!

09-09-2024 12:00:00 AM

నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీలో చర్చ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం వస్తు సేవల పన్నును (జీఎస్టీ) 5 శాతానికి తగ్గిస్తారన్న అంచనాల నడుమ సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. బీమా ప్రీమియంపై పన్నులతో పాటు పలు అంశాలపై సోమవారం భేటీ అవుతున్న జీఎస్టీ కౌన్సిల్ చర్చిస్తుందని సం బంధిత వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై మంత్రుల కమిటీ సిఫార్సులను, ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను అంశంపై కూడా కౌన్సిల్ చర్చిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

జీవిత, ఆరోగ్య బీమా, రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై విధిస్తున్న జీఎస్టీని, ఈ పన్నుద్వారా ఒనగూడే ఆదాయ ప్రభావాలపై ఒక నివేదికను కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ సమర్పిస్తుందని ఆ వర్గాలు వివరించాయి. ఆరోగ్య బీమాపై పన్ను భారాన్ని 18 శాతం నుంచి తగ్గించాలా లేక సీనియర్ సిటిజన్లు వంటి కొన్ని క్యాటగిరీల్లోని వ్యక్తులకు పూర్తి గా మినహాయించాలా అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ పన్నుకు సంబంధించి కూడా చర్చ జరుగుతుందని అంటున్నారు. ఆరోగ్య, జీవి త బీమా ప్రీమి యం చెల్లింపులపై జీఎస్టీని మినహాయించాలంటూ ఇటీవల ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో డిమాండ్ చేశాయి. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ అంశమై నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లుపై చర్చ సంద ర్భంగా సీతారామన్ స్పందిస్తూ జీఎస్టీ వసూళ్లలో 75 శాతం రాష్ట్రాలకే వెళుతుందని, పన్ను తగ్గించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ముందు ఉంచాలంటూ ప్రతిపక్ష సభ్యులు వారి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల్ని కోరాలని సూచించారు.

శ్లాబ్స్ యథాతథం?

వివిధ వస్తు సేవలకు 5, 12, 18, 28 శాతంగా ఉన్న జీఎస్టీ శ్లాబ్‌ల్లో ప్రస్తుతానికి మార్పు చేయనక్కర్లేదని జీఓఎం అభిప్రాయపడింది. అయినప్పటికీ రేట్ల హేతుబ ద్దీకరణకు ఎంతమేరకు అవకాశం ఉన్నదో చూడాలని ఫిట్‌మెంట్ కమిటీని కోరింది. ఆన్‌లైన్ గేమింగ్‌పై 2023 అక్టోబర్ 1కంటే ముందు, ఆ తర్వాత వచ్చిన జీఎస్టీ పన్ను వసూళ్లపై  ఒక నివేదికను తాజా ఎస్టీ కౌన్సి ల్ భేటీలో ఫిట్‌మెంట్ కమిటీ సమర్పిస్తుం ది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్, క్యాసినోల్లో ఎంట్రీలెవల్ బెట్స్‌పై 28 శాతం జీఎస్టీ అమలవు తున్నది.

అంతకు ముందు నైపుణ్యంతో ఆడే గేమ్స్, ఛాన్స్ కోసం ఆడే గేమ్స్‌కు పన్ను రేట్లు వేరువేరుగా ఉండాలని వాది స్తూ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు 28 శాతం పన్నును చెల్లించేవికావు. దీనితో ఈ పన్ను నిబంధనలో స్పష్టత ఇచ్చేందుకు కేంద్ర జీఎస్టీ చట్టాన్ని సవరించారు. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ 28 శాతం పన్ను చెల్లించాల్సిందేనని 2023 ఆగస్టులో జరిగి న సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే తాజా చట్టం ప్రకారం ఆఫ్ షోర్ (విదేశీ) గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ కూడా జీఎస్టీ కార్యాలయాల్లో రిజిష్టర్ చేసుకుని, పన్నులు చెల్లించాల్సిందే. లేకపోతే ఆ సైట్స్ ను ప్రభుత్వం బ్లాక్ చేస్తుంది.