21-03-2025 12:23:46 AM
కరీంనగర్, మార్చి 20 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు కరీంనగర్ జిల్లాలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు సన్నాహాక సమావేశా లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల స్థానాలను కైవసం చేసుకొని పట్టుమీద ఉన్న బీజేపీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని, అలాగే కరీంనగర్ నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగురవేయాలనే కుతుహలంతో ఉంది.
ఈ మేరకు ఈ నెల 21న కరీంనగర్ లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయిం చింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరై దిశానిర్దేశనం చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ లో ఉన్న మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు బీజేపీలో చేరడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకోవ డంతో ఈసారి బల్దియాపై జెండా ఎగురవేయాలన్న ఉత్సాహంతో ఉన్న పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు సిద్ధమవుతున్నది.
ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఢీలా పడిపోయిన బీఆర్‌ఎస్ పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కు 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించి పార్టీ క్యాడర్లో జోష్ తీసుకురావాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 23న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే సమావేశంలో పాల్గొని దిశానిర్దేశనం చేయనున్నారు.
కేటీఆర్ కార్యక్రమం విజయంతం కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ , మాజీ ఎమ్మెల్సీ నారదాసులు సమావేశమై నాయకులకు సూచనలు చేశారు. 23న కేటీఆర్ పార్టీ క్యాడర్ ను స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు సమావేశం కానుండడంతో ఈ సభకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా 21న జరిగే బీజేపీ సన్నాహక సమావేశం కోసం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, పార్టీ నాయకులు సమావేశమై సమావేశం విజయవంతం కోసం కార్యాచరణ రూపొందించారు.
ఇరు పార్టీలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండడంతో రెండు పార్టీలు స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టేందుకేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఢీ కొని గులాబీ గుభాలిస్తుందా.. కమలం వికసిస్తుందా వేచి చూడాలి.