న్యూఢిల్లీ, జనవరి 17: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల సవరణకు 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పింఛన్ల పెంపు అంశం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం 2016 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఉద్యోగులు ఆర్థికపరమైన ఫలాలు పొందుతున్నారు.
పింఛన్ల పెంపుపై టీమ్‌లీజ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కృష్ణేందు ఛట్టర్జీ మాట్లాడుతూ.. ‘వేతనాల పెంపు ఆధారంగానే పింఛన్ల పెంపు ఉంటుంది. ఫిట్‌మెంట్ 2.5 -2.8 ఉంటే పెన్షన్ రూ.9 వేల నుంచి రూ.25,200 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం’ అని వెల్లడించారు.
సింఘానియా అండ్ కో సంస్థ పార్ట్‌నర్ రితికా నయ్యర్ మాట్లాడుతూ.. ‘8వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం పింఛన్ల పెంపు 20శాతం నుంచి 30శాతం వరకు ఉండొచ్చు’ అని అభిప్రాయపడ్డారు. ఫాక్స్ మండల్ అండ్ అసోసియేట్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ పార్ట్‌నర్ సుమిత్ ధర్ మాట్లాడుతూ..‘8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ 2.86 సిఫార్సు చేసి, కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు 186 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’ అని తెలిపారు.