భూతల స్వర్గంగా పిలిచే జమ్మూ కశ్మీర్ అంటేనే ఆహ్లాదకర వాతావరణంతో మనసులను దోచేసే మంచుకొండలు గుర్తొస్తాయి. ఆ రాష్ట్రం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రాజకీయంగా వేడెక్కింది. కాల్పుల చప్పుళ్లతో నిత్యం రగులుతుండే ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత మూడు విడతలలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలను నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయానికి రెఫరెండంగా భావిస్తున్నారు. ఆర్టికల్ రద్దే కాకుండా ఈ ఎన్నికల్లో మరో కీలకాంశం కశ్మీర్ పండిట్ల సమస్య. దిక్కుతోచని స్థితిలో డోలాయమానంలో ఉన్న కశ్మీర్ పండిట్లు అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కట్టుబట్టలతో ఇళ్లను విడిచి పలు ప్రాంతాల్లో శరణార్థులుగా ఉంటున్న పండిట్లు అసెంబ్లీ ఎన్నికలతోనైనా తమ తలరాతలు మారుతాయా అని ఎదురు చూస్తున్నారు.
ప్రత్యేక సంస్కృతి
ముస్లిం జనాభా అధికంగా ఉండే కశ్మీర్‌లో హిందూ బ్రాహ్మణుల ప్రత్యేక సంస్కృతి, ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ మొఘల్ చక్రవర్తి వీరిని ‘పండిట్లు’ అని అభివర్ణించారు. అనంతరం ఆఫ్ఘన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించాక పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగాయి. 1950లో ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో భూసంస్కరణలను చేపట్టినప్పుడు స్థానికులు కొందరు కశ్మీర్ పండిట్ల ప్రయోజనాలను అడ్డుకున్నారు. దీంతో పండిట్లు కశ్మీర్ నుండి వలసలను ప్రారంభించారు. 1981లో వీరి జనాభా 5 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాత కశ్మీర్ పండిట్లను ‘కాఫిర్లు’గా పిలుస్తూ కొన్ని ఉగ్రవాద సంస్థలు బెదిరింపు ఘటనలకు పాల్పడుతూ వారిని తరిమేయడమే లక్ష్యంగా అరాచకాలను సృష్టించాయి.
పాకిస్తాన్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఎస్ అండదండలతో పేట్రేగిపోయిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల దౌర్జన్యాలతో పండిట్ల పరిస్థితి మరింత దిగజారింది. మైనార్టీలుగా ఉన్న కశ్మీర్ పండిట్లపై అరాచకశక్తులు దాడులు చేస్తున్నా వారికి ప్రధానంగా 1980, 1990 మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి కావాల్సిన సానుకూల మద్దతు లభించలేదు. కశ్మీర్‌లో 1989 నుండి పండిట్లపై దౌర్జన్యాలు మితిమీరాయి. 1990 జనవరి వారికి ఒక పీడ కలగా మిగిలిపోయింది. పండిట్లు కశ్మీర్‌ను విడిచిపెట్టాలని హెచ్చరిస్తూ హిజ్బుల్ ముజాహిదీన్ స్థానిక ఉర్దూ దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది.
పోస్టర్లు అంటించింది. జిహాదీ పేరుతో కొందరు తుపాకులు చేపట్టి బహిరంగంగా పరేడ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. కొన్ని ప్రార్థనా స్థలాలనుండి బహిరంగంగా పండిట్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పండిట్లపై హత్యలు, బాంబు దాడులు, కాల్పులు, దౌర్జన్యాలు సర్వసాధారణమయ్యాయి. కశ్మీర్‌పై ఢిల్లీ నేతల పెత్తనం అధికమవడం, కేంద్ర ప్రభుత్వ పాలకులు అణిచి వేస్తున్నారని ఇందిరాగాంధీ పాలన నుండి అశాంతితో ఉన్న కశ్మీరీలు తమ ఆగ్రహాన్ని స్థానిక పండిట్లపై చూపడంతో వందలాది మంది ఆ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయారు.
1990 జనవరి మధ్యలో కశ్మీర్ లోయలో పండిట్ల జనాభా సుమారు లక్షన్నర ఉండగా, వారిలో దాదాపు లక్షా పాతిక వేలమంది కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు పారిపోయారు. ఈ ఘటనలతో పండిట్లలో అధికులు జమ్మూకు శరణార్థులుగా వెళ్లారు. మరికొందరు ఢిల్లీలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ‘బతుకు జీవుడా’ అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
అన్ని పార్టీలదీ అవకాశవాదమే
కశ్మీర్ పండిట్ల దీనస్థితిని రాజకీయ పార్టీలు అవకాశవాదంగా మల్చుకోవాలని చూశాయే తప్ప, శాశ్వత పరిష్కారానికి చొరవ చూపలేదు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పండిట్ల ప్రయోజనాలపై వివక్ష చూపాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కశ్మీర్ పండిట్లను స్వస్థలాలకు పంపే చర్యలు తీసుకోవడం కంటే తాత్కాలిక ఉపశమనాలకు, ప్రకటనలకే ప్రాధాన్యమిచ్చాయి. శరణార్థులుగా ఉన్న వీరిని ప్యాకేజీలకే పరిమితం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు ప్రత్యేకంగా ముస్లిం ఓట్లపై దృష్టి పెట్టి పండిట్ల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన సందర్భంలో పండిట్ల ప్రయోజనాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నమ్మబలికినా అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. బీజేపీ మాటలతో కశ్మీర్‌లో పరిస్థితులు మారి స్వస్థలాలకు తిరిగి వెళ్లవచ్చని పండిట్లు ఆశిస్తే అవి అడియాసలే అయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో శాంతిభద్రతలు ఏర్పడ్డాయని, పండిట్లు స్వస్థలాలకు తిరిగి వెళ్లారని, ఉద్యోగాలు పొందారని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని పీపుల్స్ పల్స్ పరిశోధనలో తేలింది. పండిట్లు కశ్మీర్ లోయకు వస్తుండడంతో వారు ఉద్యోగాలను, ఇళ్లను, భూములను కోరుతారని భావిస్తున్న మిలిటెంట్లు వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.
ప్రభుత్వం భద్రతపై పండిట్లలో భరోసా కల్పించలేక పోతున్నది. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద గత ఏడాది కాలంలో దాదాపు ఆరు వేలమంది పండిట్లకు ఉద్యోగాలు, నివాస సదుపాయం కల్పిస్తూ తాత్కాలిక ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం సహా అంతా బాగుందనే భ్రమలు కల్పిస్తున్నది మోదీ ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ప్రధాన వైఫల్యం అక్కడ కనీస భద్రత, సౌకర్యాలు కల్పించలేక పోవడం. ఈ పరిణామాలతో అన్ని విధాలా నిరాశా నిస్పృహలతో ఉన్న కశ్మీర్ పండిట్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికలతోనైనా దశాబ్దాలుగా నలిగిపోతున్న తమకు మంచి జరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు.
రాజకీయ ప్రాధాన్యత కోరుతున్న పండిట్లు
రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు తమకు రాజకీయ ప్రాధాన్యతనిచ్చి టికెట్లు ఇవ్వాలని పండిట్లు కోరుతున్నారు. రాజకీయంగా గుర్తింపు లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని, చట్టసభలో గళాన్ని వినిపించలేక పోయామని వారు భావిస్తున్నారు. పండిట్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ప్రభుత్వం తీసుకొనే పాలనా విధానాల్లో తమ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం లభిస్తుందని, తమకు రాజ్యాంగ పరిరక్షణ ఉంటుందని వారు ఆశిస్తున్నారు. దశాబ్దాలుగా శరణార్థులుగా దేశంలో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న తాము సొంత ఇళ్లకు సురక్షితంగా తిరిగి వచ్చేలా భద్రతతోపాటు సౌకర్యాలు కల్పించేలా నిర్ణయాలు తీసుకోనే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడాలని వారు కోరుతున్నారు.
ఇందులో భాగంగా ఆక్రమణకు గురైన తమ స్థలాలను, ఇళ్లను తమకు ఇప్పించాలని, ధ్వంసం చేయబడ్డ ఇళ్లను తిరిగి నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని, పండిట్ల కాలనీలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వ్యాలీలో శాంతిభద్రతలను పరిరక్షించేలా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. అల్లర్లతో కశ్మీర్ వ్యాలీని విడిచిపెట్టిన పండిట్లను ఆ గాయాలు ఇప్పటికీ పీడ కలలా వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం తమ భద్రతపై భరోసా కల్పించేలా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. తమపై దాడులు జరగకుండా చట్టాలను రూపొందించాలని పండిట్లు డిమాండ్ చేస్తున్నారు.
పునరుజ్జీవన ఏర్పాట్లు జరగాలి
కశ్మీర్ పండిట్ల చరిత్ర, సంస్కృతిని పరిరక్షించేలా కొత్త ప్రభుత్వం ధ్వంసమైన దే వాలయాలు, చారిత్రాత్మక స్థలాల పునరుద్ధరణ, నిర్వహణకు నిధులు కేటాయిం చాలని, పండిట్ల వారసత్వాన్ని, భాషను, చరిత్రను కాపాడే ప్రభుత్వం రావాలని వారు కోరుతున్నారు. కశ్మీర్ పండిట్ యువకులు ఈ ఎన్నికలు తమ భవిష్యత్తుకు ఆశాజనకంగా ఉండాలని భావిస్తు న్నారు. విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యతను వారు ఆశిస్తున్నారు.
ఉన్నత విద్యలో స్కాలర్ షిప్స్ ఇవ్వాలని, తమకు ప్రత్యేకంగా సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇవ్వాలని, ప్రభుత్వ ప్రయివేట్ రంగాల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాక పండిట్లకోసం ప్రత్యేకంగా ఆర్థిక మండళ్లు, స్టార్టప్‌లు ఏర్పరచాలనీ కోరుతున్నారు. మైనార్టీ హోదా కల్పిస్తూ అందుకు తగ్గట్టు హక్కులు, ప్రయోజనాలు కల్పించాలని, తమ నివాసాలను, భూములను ఆక్రమణదారుల నుండి విడిపించి తిరిగి తమకు అప్పగించాలని కోరుతున్నారు.
శాంతియుతంగా, పరస్పర అవగాహనతో గౌరవప్రదంగా జీవించేలా కొత్త ప్ర భుత్వం విధానాలను రూపొందించాలని పండిట్లు ఆశిస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో తమను కూడా భాగస్వామ్యం చేయాలని వారు కోరుతున్నారు. తమ ప్రయోజనాలను కాపాడేలా ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని పండిట్లు డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి, భవిష్యత్తుకు ఒక మలుపులా ఉండాలని వారు ఆశిస్తున్నారు. తమ సమస్యలకు పరిష్కార దిశగా, బతుకులు మారేలా అక్టోబర్ 4న వెలువడే అసెంబ్లీ ఫలితాలు ఉండాలని కోరుకుంటున్న కశ్మీర్ పండిట్ల కలలు నెరవేరుతాయో లేదో వేచి చూడాలి.
వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ