ఢిల్లీ ఎన్నికల్లో పార్టీలు విడివిడిగా పోటీ
న్యూఢిల్లీ, జనవరి 17: ఇండియా కూటమి ప్రస్తుతం అంపశయ్యపై ఉంది. కూటమి కొనసాగదని ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఇట్టే అర్థం అవుతుంది. కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ ఇప్పుడు ఏకాకిగా మిగిలింది. దేశంలో నరేంద్ర మోదీ, బీజేపీ హవాను అడ్డుకునేందుకు కాంగ్రెస్, దేశంలోని ప్రధాన పార్టీలతో కలిసి ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలియన్స్) పేరుతో కూటమి ఏర్పడింది.
ఈ కూటమిలో బెంగాల్, తమిళనాడు ను పాలిస్తున్న టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలతో పాటు ఇంకా అనేక ఇతర పార్టీలు చేరాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ కూటమి ఏర్పడగా.. ఇక బీజేపీకి కష్టాలు తప్పవని అంతా భావించారు. కానీ పరిస్థితి తలకిందులైంది. 2024 సార్వత్రిక ఎన్నిక ల్లో కూడా బీజేపీ విజయఢంకా మోగించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈ ఫలితాలతో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు పక్క చూపులు చూశాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గతసారి కంటే మెజారిటీ తగ్గిందన్న సంబురం లో ఉన్న కొన్ని కూటమి పార్టీలకు నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు కొత్త తలనొప్పులను తెచ్చిపె ట్టాయి. ఇక్కడ మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) పేరిట పోటీ చేసిన కూటమి.. బీజేపీ కూటమి మహాయుతి ముందు దారుణంగా ఓడిపోయింది.
ఈ దారుణ పరాజయానికి ఈవీఎంలతో పాటు అనేక కారణాలను కూటమి పార్టీలు చూపినా కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక ఈ ఫలితాలతో కూటమి పార్టీలు మరింతగా డీలాపడ్డాయి. ఇండియా కూటమి భవితవ్యం గురించి కూటమి ఏర్పడక ముందే ఓ సీనియర్ నేత చెప్పిన వ్యాఖ్యలు అక్షరసత్యాలు అయ్యాయి.
2023 జూన్‌లో కూటమి పార్టీలలోని ఓ సీనియర్ నేత మాట్లాడుతూ.. ‘మోదీ, బీజేపీ హవాకు కళ్లెం వేసేందుకు ఒక కూటమి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ కూటమి విజయం సాధిస్తుందని నేను హామీ ఇవ్వలేను’ అని ఆ నేత కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఏర్పడిన 18 నెలల కాలంలోనే కూటమి కుదేలైంది.
దూరంగానే ఆప్..
కూటమిలో మరో ముఖ్యమైన పార్టీగా ఆమ్ ఆద్మీ (ఆప్) ఉండేది. ఈ పార్టీ ఢిల్లీతో పాటు పంజాబ్‌లో కూడా అధికారంలో కొనసాగుతోం ది. సరిగ్గా ఎనిమిది నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. ఆప్ ఢిల్లీతో పాటు పంజాబ్‌లో కూడా కాంగ్రెస్ పొత్తుతోనే పోటీ చేసింది. కానీ ఫలితాలు ఆమ్ ఆద్మీని తీవ్రంగా నిరాశపర్చాయి.
ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా గెల్చుకోలేక చతికిలపడింది. అన్ని ఎంపీ సీట్లను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెల్చుకోవడం విశేషం. పంజాబ్‌లో కూడా ఆప్ కూటమి పార్టీలతో పోటీ చేయగా.. అక్కడ కూడా నిరాశాజన ఫలితాలే పునరావృతం అయ్యాయి.
అందుకే త్వరలో జరగ నున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విడిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనితో మిగతా పార్టీలు కూడా ఆప్‌కే తమ మద్దతును ప్రకటించా యి. ఇంత జరుగుతున్నా కానీ కూటమిలో ప్రధా న పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం కిక్కురుమనలేదు.
కూటమి పగ్గాలు కాంగ్రెస్ వద్ద ఉండగా.. వాటిని వేరే పార్టీలకి అప్పగించాలని జోరుగా చర్చ జరిగింది. కూటమిలోని చాలా పార్టీలు ఈ విషయంపై తమ భావనను వ్యక్తపరిచాయి. మహారాష్ట్రలో కూటమి ఘోర వైఫల్యం చెందిన తర్వాత మరీ ఘోరంగా పరిస్థితులు తయారయ్యాయి.
ఇక మిగిలింది అంత్యక్రియలే
18 నెలల కిందట ఏర్పడ్డ ఇండియా కూటమి కకావికలం అయింది. కూటమి ఇప్పటికే చనిపోయింది. ఇక కేవలం అంత్యక్రియలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల వేడి చల్లారిన తర్వాత ఈ తంతు కూడా పూర్తవుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ “ఇస్ బార్ చార్ సౌ పార్” అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది.
కానీ బీజేపీ అనుకున్న విధంగా 400 సీట్లు రాకుండా చేయడంలో కూటమి విజయవంతం అయింది. అయినా, మోదీ మూడోసారి ప్రధాని కుర్చీలో కూర్చున్నారు. ఇండియా కూటమి మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. పార్లమెంట్ పోరు ముగిసిన తర్వాతనే ఇండియా కూటమిలో ప్రధాన నేతగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూటమికి గుడ్‌బై చెప్పి ఎన్డీఏతో జట్టు కట్టారు.
అది సాధ్యమేనా..
ఇండియా కూటమిలో వామపక్షాలతో పాటు టీఎంసీ కూడా భాగస్వామ్య పార్టీగా ఉంది. కానీ పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు, వామపక్షాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు ఉన్నాయి. కూటమిలో ఈ రెండు పార్టీలు ఉన్నంత మాత్రాన ఈ రెండు పార్టీలు బెంగాల్‌లో విబేధాలను పక్కన పెట్టి కలిసి పోవడం అనేది కలే. అలాగే లాలూ యాదవ్-నితీశ్ కుమార్, ముఫ్తీ-ఒమర్ అబ్దుల్లాలు కశ్మీర్ లోయలో కలిసి పోతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలా అనేక కారణాలు కూటమి కుదేలవడానికి కారణం అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నోరు విప్పని కాంగ్రెస్..
కూటమిలో ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నా కానీ ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ పరిణామాలపై స్పందించడం లేదు. కూటమి పార్టీలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ మిన్నకుంటున్నది. కొద్ది రోజుల్లో జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ సెపరేటుగా పోటీ చేస్తున్నా కాంగ్రెస్ మాట్లాడడం లేదు. ఇన్ని పరిణామాలు చూసిన అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూటమి ఖేల్ ఖతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కూటమి లోక్‌సభ ఎన్నికల వరకేనా
‘ఇండియా కూ టమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే నా? కూటమి అనేది లోక్‌సభ ఎన్నికల కో సమే అయితే ఇంకా అందులో కొనసాగాల్సిన అవసరం లేదు. శాసనసభ ఎన్నిక లకు కూడా కూటమి ఉపయోగపడితే ఢిల్లీ లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలి’ అ ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లతో కూటమి కొనసాగింపుపై మరిన్ని నీ లినీడలు కమ్ముకున్నాయి. కేవలం ఒమర్ అబ్దుల్లా మాత్రమే కాకుండా అనేక మంది కూటమి భవితవ్యాన్ని ప్రశ్నిస్తున్నారు.