calender_icon.png 7 November, 2024 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశలు నెరవేరేనా?

19-07-2024 03:36:40 AM

  • మెదక్ జిల్లాలో మూతపడిన ఎన్‌డీఎస్‌ఎల్ 
  • కనుమరుగైన చెరకు పంట 
  • పునరుద్ధరణకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు 

మెదక్, జూలై 18 (విజయక్రాంతి): మెతు కు సీమగా పేరుగాంచిన మెదక్ జిల్లాలో వరి తర్వాత వాణిజ్య పంటగా చెరకును ఎక్కువగా సాగు చేసేవారు. 1988లో ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మెదక్‌తో పాటు బోధన్, మెట్‌పల్లిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ(ఎన్‌ఎస్‌ఎఫ్)లను ఏర్పాటు చేశారు. మెదక్‌లోని మంభోజిపల్లి వద్ద 156 ఎకరాల్లో ఎప్పుడైతే షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటైందో జిల్లాలో చెరకు పంటకు మహర్ధశ ప్రారంభమైంది. రైతులకు, కార్మికులకు, కూలీలకు చేతినిండా పని లభించింది. ఫ్యాక్టరీలో 550 మంది కార్మికులు పని చేసేవారు.

వీరితో పాటు సీజనల్ కార్మికులుగా మరో 300 మందికి పని దొరికేది. ఇలా ఫ్యాక్టరీ 14 ఏళ్ల పాటు సజావుగా నడిచింది. సీజన్‌లో 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు గానుగాడేది. చెరకు గానుగాడడమే కాకుండా చక్కెర ఉత్ప త్తి జరిగేది. డిస్టిలరీలో రెక్టిఫైడ్ స్పిరిట్‌ను తయారు చేసేవారు. చెరకు పిప్పిని కాగితపు పరిశ్రమలకు పంపేవారు. ఇలా కర్మాగారం లాభాల బాటలో నడిచేది.

అనంతరం 2002 లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో నష్టాల పేరిట మెదక్, బోధన్, మెట్‌పల్లి ఫ్యాక్టరీలను కలిపి యూనిట్‌గా చేసి డేల్టా పేపర్ మిల్లు యజమానికి విక్రయించారు. దీనికి నిజాం దక్కన్ షుగర్ లిమి టెడ్(ఎన్‌డీఎస్‌ఎల్)గా పేరు మార్చారు. కాలక్రమేణా ఇది కూడా మూతపడింది.

కనుమరుగైన చెరకు పంట..

ఎన్‌డీఎస్‌ఎల్ మూతపడడంతో జిల్లాలో చెరకు పంట కనుమరుగైంది. వేలాది ఎకరా ల్లో చెరకు పండించిన రైతులు జిల్లాలో ఉన్న ఏకైక ఫ్యాక్టరీ మూతపడడంతో సాగును తగ్గించారు. ఇతర ఫ్యాక్టరీలకు తరలించాలన్నా రవాణా ఇతరత్రా ఖర్చులు పెరగడం తో సాగుపై అనాసక్తి చూపించారు. రామాయంపేట మండలంలో కొంత ప్రాంతంలో చెరకు పంటను సాగు చేసేవారు. పండిన చెరకును కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లోని ఫ్యాక్టరీకి తరలించేవారు. 

సభా సంఘం ఏర్పాటైనా.. 

2004లో సీఎం వైఎస్‌ఆర్ ఎన్‌డీఎస్‌ఎల్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి  తీసుకోవడమా లేక ప్రైవేట్‌గా కొనసాగించడమా అనే విషయమై సభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. సభాసంఘం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణా మాలతో సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సబ్ కమిటీ వేశారు. కమిటీ నివేదిక ఇచ్చేలోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 

లే ఆఫ్‌తో వీధినపడ్డ కార్మికులు..

తెలంగాణలో అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఎన్‌డీఎస్‌ఎల్‌ను పునరుద్ధరిస్తామని 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీనిచ్చారు. అయితే, 2015 డిసెంబర్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై లేఆఫ్ ప్రకటించారు. దీంతో మంభోజిపల్లిలోని చక్కెర కర్మాగారం మూతపడి 350 మంది కార్మికులు వీధినపడ్డారు. తీవ్ర మనోవేదనకు గురై సుమారు 25 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. 

మరోసారి తెరపైకి..

ఎన్‌డీఎస్‌ఎల్ పునరుద్ధరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కమిటీ వేసి మూడు కర్మాగారాలను పునరుద్ధరిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. అనుకున్నదే తడవుగా పునరుద్ధరణ కమిటీని వేశారు. ఇందులో మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహతో పాటు సభ్యులుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావుతో పాటు మరో ఏడుగురి ని నియమించారు. కమిటీ సభ్యులు బోధన్ చక్కెర కర్మాగారాన్ని సందర్శించి అక్కడి రైతులతో, కార్మికులతో మాట్లాడారు. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు మొగ్గు చూపడంతో 51 శాతం వాటా ఉన్న యాజమాన్యం మూడు యూనిట్ల పై రూ.190 కోట్ల అప్పు చేయగా, ప్రభు త్వం ఇప్పటికే రూ.160 కోట్లు చెల్లించింది. సెప్టెంబర్‌లో మిగతా రూ.30 కోట్లు చెల్లించి రైతులకు ఇచ్చిన మామీ మేరకు ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకొ ని పునరుద్ధరించనుంది. 

చెరకు రైతుకు మద్దతు కరువు

సంగారెడ్డి, జూలై 18 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలు సాగు చేస్తారు. ముఖ్యం గా చెరకు సాగుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే, ప్రభుత్వ చక్కెర ఫ్యాక్టరీలు మూతపడడం, ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో మద్దతు ధర దక్కకపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు గత నాలుగేళ్లుగా చెరకు సాగుపై ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో రైతులు తాము సాగు చేసిన చెరకును కొత్తకోట చక్కెర ఫ్యాక్టరీ, కామారెడ్డిలోని గాయత్రి ఫ్యాక్టరీలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని షుగర్ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు.

అదే విధంగా స్థానికంగా జహీరాబాద్‌లో ఉన్న ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీకి తరలించేవారు. అది కూడా గతేడాది మూతపడ డంతో రైతులు ఇతర ఫ్యాక్టరీలకు చెరకును తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో రవా ణా భారం పెరిగింది. ఒక ఎకరం చెరకు సాగు చేసేందుకు రైతు రూ. 55 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఎరువుల ధరలు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో రైతులకు పంట సాగు భారంగా మారింది.