calender_icon.png 1 October, 2024 | 5:07 AM

హైకోర్టునూ కూలుస్తారా?

01-10-2024 02:59:37 AM

  1. హైడ్రా తీరుపై ఉన్నత న్యాయస్థానం సీరియస్ 
  2. బాస్‌ల మాట వింటే బాధితులు మీరే అవుతారు
  3. హైకోర్టు ఉత్తర్వులు చదివే తీరిక లేదా? 
  4. చంచల్‌గూడ, చర్లపల్లికి పంపిస్తేనే తెలుస్తది 
  5. ఇలాగైతే హైడ్రా జీవో 99పై స్టే విధిస్తాం 
  6. అమీన్‌పూర్ నిర్మాణాలపై యథాతథ స్థితికి ఉత్తర్వులు
  7. వర్చువల్‌గా విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ 
  8. వ్యక్తిగతంగా హాజరైన అమీన్‌పూర్ తహసీల్దార్ రాధ
  9. కూల్చివేతలపై కౌంటర్ల దాఖలుకు ఆదేశం 
  10. విచారణ అక్టోబర్ 15కి వాయిదా 

* అమీన్‌పూర్‌లో ఏమి కూల్చి వేస్తున్నారో తెలుసుకోకుండా మెన్ అండ్ మిషన్స్ పంపిస్తారా?  రేపు ఇదే తరహాలో చార్మినార్, తహసీల్దార్ కోరితే హైకోర్టు బిల్డింగ్ కూల్చేందుకు కూడా మెన్ అండ్ మిషన్స్ ఇచ్చేస్తారా?

 హైకోర్టు

* శని, ఆదివారాలతోపాటు సూర్యాస్తమయం తరువాత కూల్చివేతలు ఉండరాదని ఈ హైకోర్టు తీర్పు ఉన్నా ఎలా ఉల్లంఘిస్తారు? ఉరి వేసే ముందు కూడా ఖైదీ చివరి కోరిక అడుగుతారు. ఇది సహజ న్యాయసూత్రం. నోటీసులకు వారు ఇచ్చిన వివరణ పరిశీలించరా?  కోర్టు ఉత్తర్వులనూ పట్టించుకోరా? స్టేలు ఉన్నా ఎలా చర్యలు చేపడతారు? ఐదు నెలలు ఆగినవారు మరో రోజు ఆగలేరా? 48 గంటల గడువు ఇచ్చి అది పూర్తయ్యేదాకా కూడా ఆగరా?  

 తహసీల్దార్‌కు హైకోర్టు ప్రశ్నలు

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా సహకారంతో జరిగిన కూల్చివేతల వ్యవహారంపై అమీన్‌పూర్ తహసీల్దార్, హైడ్రా కమిషనర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

సోమవారం జరిగిన విచారణలో ప్రశ్నల వర్షం కురిపించి హైడ్రా కమిషనర్ ఆర్ రంగనాథ్, అమీన్‌పూర్ తహసీల్దార్ రాధను ఉక్కిరిబిక్కిరి చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99 అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

రాజకీయ బాసులు, ఉన్నతాధి కారుల మాటలు వింటే బాధితులుగా మిగిలేది మీరేనని మందలించింది. కూల్చివేతలే లక్ష్యంగా చర్యలు ఉంటే, చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా, కోర్టు ఉత్తర్వులను అమలు చేయనప్పుడు చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు పంపితేనే పరిస్థితులు మారతాయని వ్యాఖ్యానించింది.

శని, ఆదివారం, సెలవు దినాల్లో కూల్చరాదని ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించింది. అమీన్‌పూర్‌లో అక్రమణల తొలగింపునకు మెన్ అండ్ మిషన్ కావాలని తహసీల్దార్ లేఖ రాస్తే తాము వాటిని సమకూర్చామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన వివరణతో విబేధించింది.

సెలవుల్లో కూల్చ కూడదన్న హైకోర్టు తీర్పు గురించి తహసీల్దార్‌కు చెప్పాలని మీకు తెలియదా? అని కమిషనర్‌ను ప్రశ్నించింది. అమీన్‌పూర్‌లో ఏమి కూల్చివేస్తున్నారో తెలుసు కోకుండా మెన్ అండ్ మిషన్స్ పంపిస్తారా? అని మండిపడ్డది. రేపు ఇదే తరహాలో చార్మినార్, తహసీల్దార్ కోరితే హైకోర్టు బిల్డింగ్ కూల్చేందుకు కూడా మెన్ అండ్ మిషన్స్ ఇచ్చేస్తారా అని నిలదీసింది.

కూల్చివేతల తీరుపై ఆగ్రహం

ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేతల్లో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైడ్రా పనితీరు సంతృప్తికరంగాలేదని వ్యాఖ్యానించింది. ఏర్పాటైనప్పటి నుంచి హైడ్రా కూల్చివేతలే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుందని, జీవో 99 ప్రకారం అందులో పేర్కొన్న ఇతర విధులైన విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితరాలను పట్టించుకోనట్టుందని పేర్కొంది.

నిబంధనల ఉల్లంఘనలపై నిలదీస్తూ కూల్చివేతల వ్యవహారంలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు జరిగా యంది. కూల్చివేతలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశి స్తూ విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది. అమీన్‌పూర్ సర్వే నంబర్ ౧౬౪లోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను ౪౮ గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20న తహసీల్దార్ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ డాక్టర్ మహమ్మద్ రఫీ, అమీన్‌పూర్‌కు చెందిన గణేశ్ కన్స ట్రక్షన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

పటేల్‌గూడలో విల్లాల కూల్చివేతపై ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ కే శ్రీనివాసరావు మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ వ్యవహారం లో వ్యక్తిగతంగా హాజరైన అమీన్‌పూర్ తహసీల్దార్ రాధ, ఆన్లైన్ ద్వారా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై  న్యాయమూర్తి ప్రశ్నలను సంధించారు. ప్రస్తుత పోస్టులు శాశ్వతం కాదని, మళ్లీ బదిలీలు తప్పవని, అలాంటప్పు డుపై అధికారులు చెప్పారంటూ నిబంధనలను ఉల్లంఘిస్తే పర్యవ్యసానాలు మీరే ఎదు ర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

శని, ఆదివారాలతోపాటు సూర్యాస్తమయం తరువాత కూల్చివేతలు ఉండరాదన్న ఈ హైకోర్టు తీర్పు ఉన్నా ఎలా ఉల్లంఘిస్తారని తహసీల్దార్‌ను నిలదీశారు. ఉరి వేసే ముందు కూడా ఖైదీ చివరి కోరిక అడుగుతారని, ఇది సహజ న్యాయసూత్రమని అన్నారు. పిటిషనర్ల వెనుక జరిగిన వ్యవహారంలో ఉల్లంఘనలతోపాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిందని అభిప్రాయపడ్డారు.

నోటీసులకు వారు ఇచ్చిన వివరణ పరిశీలించరా?  కోర్టు ఉత్తర్వులనూ పట్టించుకోరా? స్టేలు ఉన్నా ఎలా చర్య లు చేపడతారు? 5 నెలలు ఆగినవారు మరో రోజు ఆగలేరా? 48 గంటల గడువు ఇచ్చి అది పూర్తయ్యేదాకా కూడా ఆగరా? అంటూ ఎమ్మార్వో తీరుపై మండిపడ్డారు. పిటిషనర్లు 2021లో స్థలం కొనుగోలు చేశాక మీకు మార్చిలో తెలిసి ఏప్రిల్ 1న సర్వే చేశామంటున్నారని.. సర్వే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వరా? అంటూ ఎమ్మార్వోను ప్రశ్నించారు.

అసలు సర్వే చేసే విధానం ఏమిటో తెలుసా? అని నిలదీశారు. భవన నిర్మాణ అనుమతులు రద్దు, విద్యుత్ కనెక్షన్ రద్దులపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించి పిటిషనర్లు స్టేలు పొందారని, వాటిని తొలగించకుండా చర్యలు ఎలా చేపడతారన్నారు. పిటిషనర్లు 15న లేఖ రాస్తూ 15 రోజులు గడువు కోరినప్పటికీ ఏప్రిల్ 18న వివరణ ఇచ్చారని, దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని అడిగారు.

48 గంటల్లో భవనాన్ని ఖాళీ చేయాలని 20న నోటీసు ఇచ్చినపుడు 48 గంటల సమయమూ ఇవ్వకుండా ఆదివారం ఎలా కూల్చి వేతలు చేపడతారని నిలదీశారు. అసలు కోర్టు ఉత్తర్వులను చదివారా? అన్ని రకాలుగా స్టేలున్నపుడు వాటిని తొలగించకముందే మీరెలా చర్యలు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అన్ని నోటీసులు ఒకే రోజు ఇచ్చి చర్యలు చేపడతారా? ఇదేనా మీకు తెలిసిన చట్టం? ఇన్ని ఉల్లంఘనలకు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందని అడిగారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్లాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారా? అలాగైతే చెప్పండి ఆయన్ని పిలిపించి వివరణ అడుగుతామని అన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయనపుడు జైలుకు పంపితే అప్పుడు            తెలుస్తుందన్నారు. 

గుడ్డిగా వెళ్లిపోతారా?

తహసిల్దార్ లేఖ రాస్తే నిబంధనలను పరిశీలించకుండా గుడ్డిగా యంత్రాలను పంపేస్తా రా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. హైకోర్టు, చార్మినార్లను కూల్చివేయడానికి యంత్రాలను పంపాల ని అడిగితే పంపుతారా? అని నిలదీసింది. పేట్‌బషీరాబాద్‌లోని ప్రభుత్వ స్థలంలో పోలీసు స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలున్నాయని, వాటిని కూల్చివేసి తరువాత సామాన్యుల ఇళ్ల వద్దకు వస్తారా? అని ప్రశ్నించారు.

కూల్చివేతల నిమిత్తం వాహనాలు, మనుషులను పంపాలని తహసిల్దార్ కోరినపుడు ఆదివారం కుదరదని నిరాకరించాలి కదా.. ఎలా కూల్చివేతలు చేపడతారని ప్రశ్నించింది. ఈ దశలో రంగనాథ్ సమాధానమిస్తూ తమది సమన్వయం చేసే ఏజన్సీ మాత్రమేనని, తహసీల్దార్ లేఖ రాయడంతోనే యంత్రాలను పంపామని అన్నారు.

మీడియా సమావేశాలు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఓ కేసులో న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారని, దాని వివరాలను సమర్పించాలని ఆదేశించామని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్య మా అంటూ నిలదీశారు. అధికరణ 21 గురించి కూడా చెప్పారని, పిటిషనర్లు కొనుగోలు చేసిన సేల్డీడ్, నిర్మాణానికి అనుమతులు, నీరు, విద్యుత్ కనెక్షన్లు అన్నీ ఉన్నా కూల్చివేశారని, వారికి ఇది వర్తించదా అని నిలదీశారు.

ప్రభుత్వ ఆస్తులను రక్షించే విధానం ఇదేనా? అని ప్రశ్నించారు. మీ పనితీరుపై సంతృప్తికరంగా లేదని, ఇలాగైతే జీవో 99 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. జీవో లో సీఎం, మంత్రులతో కూడిన కమిటీ ఉంద ని, అయితే అందులో ఎలాంటి విధానం లేదని అన్నారు. హైడ్రాకు ఉన్న విధానం ఏమిటో చెప్పాలంటూ అడిగారు.

కమిషనర్ సమాధానమిస్తూ .. 70 శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, నగరంలో 2500 దాకా చెరువులున్నాయని, వాటినైనా పరిరక్షించాలన్నదే లక్ష్యం అని చెప్పగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్‌ను ధ్రువీకరించి నోటిఫికేషన్ జారీ చేశారని అడిగారు. గత ప్రభుత్వంలోను, ప్రస్తుత ప్రభుత్వ న్యాయవాదులకు చెరువులను గుర్తించి ఎఫ్టీఎల్‌ను గుర్తించి తరువాత చర్యలు చేపట్టాలని ఆదేశించినా ఇప్పటివరకు ఒక్క చెరువుకూ ఎఫ్టీఎల్ నిర్ధారించలేదని అన్నారు.

ఒక కేసులో తహసీల్దార్, ఆర్డీవో, నీటిపారుదలశాఖ అధికారులు అనుమతులన్నీ ఇచ్చాక తరువాత అవన్నీ చట్టవిరుద్ధమంటూ కూల్చివేతలు చేపట్టారని, ఇలాంటి అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించామని అన్నారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగించరాదని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయరాదని తాము చెప్పడం లేదని.. నిబంధనల ప్రకారమే చేయాలనే చెప్తున్నామని అన్నారు.

ఒకవేళ నోటీసులు ఇచ్చినా అక్రమాలు కొనసాగిస్తున్నట్టయితే ఆస్తులను సీజ్ చేసే అధికారం ఉందని, అలా ఎందుకు చేయకూడదని అడిగారు. అధికారం ఉన్నపుడు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోకుండా వాటికి విరుద్ధంగా కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు.

ప్రస్తుతానికి ఈ పిటిషన్లలో యథాస్థితిని కొనసాగించాలని ఇరుపక్షాలను ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తహసిల్దార్, హైడ్రా కమిషనర్లను ఆదేశిస్తూ విచారణను 15కు వాయిదా వేశారు. తదుపరి విచారణకు హాజరుకావాల్సిన అవసరంలేదన్నారు.

మూసీ ఆక్రమణల తొలగింపుపై విధానం ఉందా?

రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు ఏ విధానాన్ని అమలుచేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభు త్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. అసలు ఆక్రమణల తొలగిం పునకు ఏ విధానం రూపొందించారో లేదో చెప్పాలంది. విధానం అంటూ ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. 1900లో సర్వే చేసి ఎఫ్‌టీఎల్ నిర్ధారించాక జరిగిన నిర్మాణాల తొలగింపునకు ఇప్పుడు నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించింది.

మూసీ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఏ చర్య చేపట్టేదీ వివరించాలంది. ఏ చర్యలు తీసుకున్నా చట్ట ప్రకరామే ఉండాలని ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. మూసీ పరీవాహక ప్రాంతంలో అక్ర మ నిర్మాణాల గుర్తింపునకు సంబంధించి అధికారులు మార్కింగ్ చేయడంతో కూల్చివేత చర్యలు తీసుకుంటారనే భయాందోళ నలతో పలువురు లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిని జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదిస్తూ, ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణల తొలగింపు  చర్యలు తీసుకో బోమని చెప్పారు. ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని తెలిపారు. ఇది బాధితులతో చర్చలు జరుపుతోందని వివరించారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయ ఇళ్లను చూపిస్తామన్నారు.

సుమారు 2,100 మందిదాకా పేదలు ఉన్నట్లు కలెక్టర్ గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికిప్పుడు తొలగింపు చర్యలు చేపట్టడంలేదన్నారు. వాదనల తర్వా త హైకోర్టు ప్రభుత్వ హామీని రికార్డుల్లో నమోదు చేసింది. మొత్తం చెరువులన్నింటినీ గుర్తించి ఎఫ్‌టీఎల్ నిర్ధారించాక చర్యలు చేపట్టేలా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శికి సూచించాలని సలహా ఇచ్చింది.

ప్రభుత్వ చర్యలు ప్రజలకు నమ్మకం కలిగించాలని హితవు పలికింది. లేదంటే చరిత్ర పునరావృతం అవుతుందని వ్యాఖ్యానించింది. ఇంత కంటే ఎక్కువ చెప్పలేమని కూడా వ్యాఖ్యానించింది. ఏ చర్య చేపట్టినా చట్టప్రకారం ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేసింది.