మహాభారత కాలం నుంచి వస్తున్న మల్లయుద్ధంలో మనకు మంచి రికార్డే ఉంది.. మట్టి నుంచి మ్యాట్‌పైకి మారిన రెజ్లింగ్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఏడు ఒలింపిక్ పతకాలు దక్కాయి. విశ్వక్రీడల్లో హాకీ తర్వాత మన దేశానికి ఎక్కువ పతకాలు వచ్చింది కుస్తీలోనే. స్వతంత్ర భారతంలో దేశానికి తొలి వ్యక్తిగత పతకం రెజ్లింగ్‌లోనే దక్కింది. 1952 ఒలింపిక్స్‌లో కేడీ జాదవ్ కంచు మోత మోగించాడు. ఆ తర్వాత 2008 ఒలింపిక్స్ నుంచి వరుసగా నాలుగు విశ్వక్రీడల్లో రెజ్లింగ్ క్రీడలో భారత్‌కు పతకాలు దక్కాయి. మరో 6 రోజుల్లో ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌లోనూ మన రెజ్లర్లు అదే పట్టు కొనసాగించి పతకాల సంఖ్య రెట్టింపు చేయాలని ఆశిద్దాం!
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కచ్చితంగా పతకం వస్తుందన్న వాటిలో రెజ్లింగ్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో భారత్‌కు రెజ్లింగ్ క్రీడలో ఏడు పతకాలు రాగా.. అందులో 2 రజతాలు, ఐదు కాంస్యాలు ఉన్నాయి. 1952 ఒలింపిక్స్‌లో కేడీ జాదవ్ తొలిసారి కాంస్యం పతకం గెలిచి కుస్తీ పోటీల్లో దేశానికి తొలి పతకం అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కుస్తీ పోటీలో కాంస్యం నెగ్గి 56 ఏళ్ల తర్వాత రెజ్లింగ్‌లో భారత్‌కు రెండో పతకం అందించాడు.
ఇక్కడి నుంచే మన మల్లయోధులు విశ్వక్రీడల్లో పట్టు నిలుపుకుంటూ వస్తున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌కు వచ్చేసరికి సుశీల్ పతకం రంగు మార్చి దేశానికి రజతం అందించగా.. యోగేశ్వర్ దత్ కాంస్యం గెలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో దేశానికి రెండే పతకాలు వచ్చాయి. రెజ్లింగ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సాక్షి మాలిక్ కాంస్యంతో సత్తా చాటింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మన మల్లయోధులు రెండు పతకాలతో మెరిశారు. రవికుమార్ దహియా, బజరంగ్ పునియాలు వరుసగా రజత, కాంస్యాలతో మెరిశారు.
వినేశ్‌పైనే ఆశలు..
పారిస్ క్రీడలకు రెజ్లింగ్ విభాగంలో ఈసారి మన దేశం నుంచి ఆరుగురు పోటీలో ఉన్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ (57 కేజీల) విభాగంలో అమన్ షెరావత్ పోటీలో ఉండగా.. మహిళల ఫ్రీ స్టయిల్ నుంచి వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అంతిమ్ పంగల్ (53 కేజీలు), అన్షు మాలిక్ (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత రెండేళ్లలో దేశ రెజ్లింగ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై రెజ్లర్లు గళమెత్తారు. ఏడాది పాటు ఆందోళనలు, నిరసనలతో రెజ్లింగ్ సమాఖ్య అట్టుడికింది. ఇవన్నీ మరిచి మన రెజ్లర్లు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. 2016, 2020 ఒలింపిక్స్‌లో పాల్గొన్న వినేశ్ ఫొగాట్‌కు ఇది వరుసగా మూడో ఒలింపిక్స్ కానున్నాయి. రెండుసార్లు పతకం గెలవడంలో విఫలమైన వినేశ్ ఈసారి పతకంతో తిరిగి వస్తుందని అంతా భావిస్తున్నారు.