calender_icon.png 30 January, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు.. ముందుకు సాగేనా?

29-01-2025 12:05:52 AM

  1. కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో ఆందోళనలో రైతన్నలు 
  2. భూములు కోల్పోతే తమ తమ బతుకులు ఎలా అంటూ ఆవేదన
  3. ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలం రహదారులు ఉండగా మరో రోడ్డు ఎందుకని బీజేపీ నేతల డిమాండ్ 
  4. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటున్న బీఆర్‌ఎస్ 

కడ్తాల్, జనవరి 28 ( విజయ క్రాంతి ) : రంగారెడ్డి జిల్లాలో రైతులపై గ్రీన్‌ఫీల్డ్ పిడుగు పడనున్నది. మీరాఖాన్ పేట  సమీ పంలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు రావిరా ల నుంచి మీరాఖాన్ పేట్,  కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆమనగల్లు మండలం ఆకు తోటపల్లి వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర 330 అడుగుల వెడల్పు రహదారి నిర్మాణానికి 554 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం ఇటీవల రోడ్డు కోసం భూములను సర్వే చేపట్టారు. కానీ అడుఅడుగునా సర్వేకు రైతులు అడ్డుకున్న పరిస్థితి. ఇప్పటికే  కొంగరకలాన్ ఓఆర్‌ఆర్ నుంచి మీరా ఖాన్పేట వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 300 అడుగుల రోడ్డు వేయడానికి 449 ఎకరాలను గుర్తించి సర్వే పూర్తిచేశారు. త్వరలోనే ఆ భూములకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

కానీ కల్వకుర్తి నియోజవర్గం కడ్తాల్ మండలం  అన్మస్ పల్లి, ఎక్వాయిపల్లి, ముద్విన్, మర్రిపల్లి, ఆమనగల్లు మండలం కోనాపూర్, ఆకుతోటపల్లి, సాకిబండ తండా గ్రామాల్లో  భూసేకరణకు రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఏళ్ల కాలంగా సాగు చేస్తున్న భూములు కోల్పోతే తమ జీవనాధారం ఏమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

అన్నదాతలకు తము అండగా ఉంటామని బిఆర్ ఎస్, బీజేపీ పార్టీలు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం రహదారులు ఉన్న మరో రోడ్డు ఎందుకని ఈ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఓ పక్క రైతుల ఆందోళన, మరో పక్క ప్రతి పక్షాల విమర్శలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న గ్రీన్ ఫీల్ రోడ్డు ముందుకు సాగుతదా అంటూ జనంలో చర్చ మొదలయింది. కానీ రైతుల భూములు లాకుంటే ఆందోళన తప్పదని బిఆర్ ఎస్, బీజేపీ పార్టీలు హెచ్చరిస్తున్న పరిస్థితి.