calender_icon.png 23 October, 2024 | 9:02 AM

కొలువుల కొట్లాట ఆగేనా?

18-10-2024 12:00:00 AM

డా. తిరుణహరి శేషు :

అరు దశాబ్దాల అలుపెరగని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకా రుల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సజీవంగా నిలబెట్టిన నినాదం నిధులు, నీళ్లు, నియామకాలు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో సమైక్యాంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంత యువతకు జరిగిన అన్యాయమే ఉద్యమ ఆకాంక్షను నిప్పు రవ్వలాగా రగిలించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది.

ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతంలోని యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతామని, మన ఉద్యోగాలు మనకే వస్తాయనే ఆశలు కల్పించడంతో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో యువత ముందు వరుసలో నిలబడి ఉద్యమించటం వలన ప్రత్యేక రాష్ట్ర కల సాకార మైంది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన ఈ దశాబ్ద కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో, ఉద్యోగాల కల్పనలో వైఫల్యం చెందిందనే భావ నతో స్వరాష్ట్రంలో కూడా కొలువుల కొట్లాటకై యువత ఉద్యమ బాట పట్టటం వల్లనే దశాబ్ద కాలం తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిందనే విషయాన్ని గమనించాలి. 

దశాబ్దపు ఎదురుచూపు 

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ముల్కీ నిబంధనలు వచ్చినా, 610 జీవో వచ్చినా ఉద్యో గాల భర్తీలో తెలంగాణ యువత ప్రయోజనాలను కాపాడలేకపోవడం వల్ల తెలంగా ణ ప్రాంతంలోని యువతకు నష్టం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత యువత ప్రభుత్వ ఉద్యోగాలపై గంపెడు ఆశలు పెట్టుకుంది. నాటి ప్రభు త్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో యువత ఆకాంక్షలు, ఆశల మేరకు పనిచేయలేదనే చెప్పాలి.

గత ప్రభుత్వ మొదటి ఐదు సంవత్సరాల కాలంలో  ఉద్యోగాల భర్తీలో పూర్తి గా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.  పదేళ్లలో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని గత ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి.కానీ వాస్తవంగా పదేళ్లలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసింది 1,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే.

టీజీపిఎస్‌సీ లాంటి ఒక ప్రధాన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీకి చైర్మన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తన ఐదేళ్ల పదవీకాలంలో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగలిగానని నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌంద ర రాజన్‌కు నివేదిక సమర్పించారంటేనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎంత నత్తనడకన కొనసాగిందో అర్థమవుతుంది.

ఆ పదేళ్లలో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం ఇవ్వగలిగింది. కానీ గ్రూప్1, గ్రూప్2, జూనియర్ కాలేజీ లెక్చరర్స్, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ లాంటి నోటిఫికేషన్ ఒక్కసారి కూడా విడుదల చేయలేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌కోసం విద్యార్థులు కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదు రు చూసిన చీకటి రోజులను గుర్తుకు తెస్తున్నాయి.

ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం ఒక వైపు అయితే నోటిఫికేషన్ విడుదలలో జాప్యం, పోటీ పరీక్షల నిర్వహణా వైఫల్యం మరొకవైపు. ఒక్క గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రెండు పర్యాయాలు నిర్వహించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరీక్షా పత్రాల లీకేజ్, పరీక్ష పత్రాలలో తప్పులు దొర్లటం వలన కోర్టు వివాదాల తో ఒక విధంగా యువత, నిరుద్యోగులలో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. 

అధికార మార్పిడిలో కీలకం 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మూడవ పర్యాయం జరిగిన శాసనసభ ఎన్నికలలో గత ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు కీలక భూమిక పోషించారనేది వాస్తవం.  పదేళ్లు గా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జరిగిన జాప్యమే  రాష్ట్రంలో అధికార మార్పిడిలో  ప్రధాన అంశంగా మారిందనే చెప్పాలి.

ఎన్నికలకు ముందు హడావుడిగా నోటిఫికేషన్ ద్వారా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినా నిరుద్యోగ యువతలో నమ్మ కం కలిగించ లేకపోయారు.ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వైఫల్యం ఎన్నికలలో తమకు నష్టం చేస్తుందని నాటి ప్రభుత్వం ఎన్నికల కు ముందు గ్రహించినా జరగాల్సిన నష్టం జరిగి పోయింది. మరొకవైపు నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ ౨ లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న హామీ ఆపార్టీ గెలుపునకు దోహదపడింది. 

ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి 

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయలేని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి ఈ 10 నెలల కాలంలో 45 వేల ఉద్యోగాలకు సం బంధించిన ఉద్యోగ నియామక పత్రాలను అందజేసింది.

గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా 5000 ఉద్యోగాలతో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను  రద్దుచేసి మరొక 6000 ఉద్యోగాలను అదనంగా కలిపి 11 వేల టీచ రు ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చిం ది. ఎన్ని అవాంతరాలు వచ్చినా 65 రోజులలోనే భర్తీ ప్రక్రియను పూర్తిచేసి దాదాపు పదివేల మందికి ఎల్బీ స్టేడియం సాక్షిగా నియామక పత్రాలు అందజేసింది.

  ఒక్క అక్టోబర్‌లోనే కొత్త ప్రభుత్వం దాదాపు 13వేల మందికి ప్రభుత్వ ఉద్యోగులుగా నియామక పత్రాలు అందజేయడంతో  ప్రభుత్వంపై యువతలో నమ్మకం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కొత్త ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి కల్పనలో త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతపరచటం, స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలు, బిఎఫ్‌ఎస్‌ఐ కోర్సుల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంచడం ప్రభు త్వ ప్రాధాన్యతా అంశంగా కనిపిస్తుంది.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనూ, అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల ద్వారా వివిధ సంస్థలతో దాదాపు 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలతో ప్రైవేట్ రంగం లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం దొరుకు తుంది.

ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా డీఎస్సీ వాయిదా వేయకుండా పరీక్షలు నిర్వహిం చి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయ టం, గ్రూప్ పరీక్షలను నిర్వహించి శీఘ్రం గా ఉద్యోగాలను భర్తీ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలు ఆహ్వానించదగినవే. రెండో పీఆర్సీ చైర్మన్ బిశ్వాల్ కమిటీ ప్రకారంగా తెలంగాణలో దాదాపు రెండు లక్షల ప్రభు త్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి

కాబట్టి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మేరకు మరింత వేగంగా, పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగా ల భర్తీ ప్రక్రియ చేపట్టినప్పుడే ప్రభుత్వం తన విశ్వసనీయతను పెంచుకోగలుగుతుం ది. 4.9 శాతం నిరుద్యోగితతో తెలంగాణ దేశంలోనే 8వ స్థానంలో ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తన తాజా సర్వేలో తెలియజేసింది. ప్రభు త్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను క్రమం తప్పకుండా సత్వరమే భర్తీ చేయగలిగితే ఉద్యమ ఆకాంక్షలకు కట్టుబడి ప్రభుత్వం పని చేస్తున్నట్లుగానే భావిస్తారు. 

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి రంగంలో కొలువుల కొట్లాట నుండి కొలువులు కొట్టేదాకా పరిస్థితులు మారడానికి ప్రభు త్వం ఉద్యోగ, ఉపాధి రంగాన్ని మరింత విస్తృత పరిచి రాష్ట్రంలోని యువతకు అండగా నిలవాలి.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం లేకుండా చేయడం, ప్రభు త్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కోర్టు వివాదాలలో చిక్కుకోకుండా చూడ టం, పోటీ పరీక్షలను పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా నిర్వహించటం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి కల్పనను విస్తృతపరచటమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినప్పుడే ఉద్యమ ఆకాంక్షలకు సమున్నత గౌరవం దక్కినట్లు అవుతుంది. 

వ్యాసకర్త సెల్: 9885465877