calender_icon.png 19 February, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం బ్రేక్‌ఫాస్ట్ అమలయ్యేనా?

02-05-2024 01:21:53 AM

సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలుపై సందేహాలు

గతేడాది హడావుడిగా ప్రారంభించిన బీఆర్‌ఎస్ సర్కారు

ప్రస్తుతం కేవలం 3,500 స్కూళ్లలోనే అమలు 

ఈ విద్యాసంవత్సరంలో అమలుపై అనుమానం

పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం

హైదరాబాద్, ఏప్రిల్ 01 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల కడుపు నింపే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ స్కీం అటకెక్కేలా కనబడుతోంది. ఖాళీ కడుపుతో సర్కారు బడులకు వచ్చే విద్యార్థుల ఆకలి తీర్చే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతేడాది అక్టోబర్ 6న లాంఛనంగా ప్రారంభమైన ఈ స్కీమ్‌ను దశలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  అమలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 27,147 పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకానికి అంకురార్పణ చేసింది.

ఈ పథకం ద్వారా పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందు విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంది. అయితే, గత విద్యా సంవత్సరం మధ్యలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఒకేసారి అమలు చేయలేకపోయింది. రాష్ట్రంలో దాదాపు 27,147 పాఠశాలలుంటే అందులో కేవలం 3,500 వరకు పాఠశాలల్లోనే దశలవారీగా అమలు చేసింది. మిగతా అన్ని స్కూళ్లల్లోనూ అమల్లోకి వస్తుందని అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులంతా ఎదురుచూశారు. కానీ ఈ స్కీమ్ అక్కడితోనే ఆగిపోయింది. పైగా స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలు, నిధుల విడుదలలో జాప్యం కారణంగా అటకెక్కే పరిస్థితి నెలకొంది. 

మంత్రుల చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభం..

గతేడాది అక్టోబర్ 6న ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను అప్పటి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి అట్టాహాసంగా ప్రారంభించారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలో మంత్రి హరీష్ రావుతో కలిసి ఈ స్కీమ్‌ను ప్రారంభించగా, నాటి మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్ పల్లిలో ప్రారంభించారు. రాష్ట్రంలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ద్వారా అల్పాహారం అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ స్కీమ్ అమలు కావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా దీన్ని ప్రారంభించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రతినెలా నిధుల కోసం అధికారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ పథకాన్ని గత అక్టోబర్‌లో ప్రారంభించగా, ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నిలకు షెడ్యూల్ రావడం, ఆ తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కేవలం 3,500 పాఠశాలలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టాక విద్యాశాఖపై ఒట్రెండు సార్లు సమీక్షలు నిర్వహించి ఈ స్కీమ్ అమలుపై ఆరా కూడా తీశారు. ఈలోపే మళ్లీ లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో మిగతా స్కూళ్లలో పథకం అమలుపై స్పష్టత కొరవడింది. ఈ కమంలోనే ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం గురించి విలేకరులు ప్రశ్నించగా ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో కొనసాగుతోందని చెప్పారు. మిగతా స్కూళ్లలో అమలు చేసే అంశంపై ఎన్నికల తర్వాత సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సీఎం బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే..

ప్రస్తుతం అమలవుతున్న స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ మెనూలో పలు వెరైటీలను విద్యార్థులకు అందిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు కొనసాగుతుండగా జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త విద్యాసంవత్సరంలో మరికొన్ని పాఠశాలల్లోనైనా ఈ పథకం అమలవుతుందా? లేదంటే అసలుకే అటకెక్కుతుందా? అనేది చూడాల్సి ఉంది.

సోమవారం ఇడ్లీ సాంబర్ లేదా గోధమ రవ్వ ఉప్మా, చట్నీ

మంగళవారం పూరి, ఆలుకుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ

బుధవారం ఉప్మా,  సాంబార్ లేదా కిచిడీ, చట్నీ

గురువారం మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్

శుక్రవారం ఉగ్గాని/పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ

శనివారం పొంగల్/సాంబార్ లేదా వెజిటేబుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ