calender_icon.png 25 November, 2024 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు స్పీడు పెరిగేనా?

25-11-2024 12:44:18 AM

  1. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్
  2. ఖమ్మంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హోరాహోరి 
  3. ముగ్గురు మంత్రుల ప్రత్యేక దృష్టి

ఖమ్మం, నవంబర్ 24 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తుమ్మ ల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

అసెం బ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 454 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,97370 మంది ఓటర్లు ఉన్నారు. 

అసెంబ్లీ ఫలితాల ఎఫెక్ట్

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్క భద్రాచలం మినహా మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలవడంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జిల్లా రాజకీయాల్లో సమూలంగా మార్పులు వచ్చాయి. జిల్లా నుంచి ముగ్గురికి మంత్రుల పదవులు రావడంతో కాంగ్రెస్ హవా పెరిగింది. బీఆర్‌ఎస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వంటి నేతలంతా సైలెంట్ కావడంతో పాటు హైదరాబాద్‌కే పరిమితం కావడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో నిస్తేజం నెలకొన్నది. 

మాజీ మంత్రుల పర్యటన..

మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారించి, పర్యటనలు చేస్తుండటంతో పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చతికలబడ్డ బీఆర్‌ఎస్ పుంజుకునేలా చేసేందుకు కృషి చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఖమ్మంలో నగరంలో వరదలు రావడంతో హరీశ్‌రావు, కేటీఆర్ ఖమ్మంలోనే మకాం వేసి, బాధితులకు అండగా నిలిచారు.

హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు తీసుకువచ్చి బాధితులను ఆదుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, రాష్ట్ర నేత హరీశ్‌రావు జిల్లా క్యాడర్‌లో నూతన జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తూ పార్టీని బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు.

పరామర్శలు కాంగ్రెస్‌ను ఓడిస్తాయా?

తాజాగా మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ ఖమ్మం జిల్లాలో పర్యటించి, రైతులను పరామర్శించారు. హరీశ్‌రా వు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి, రైతులకు భరో సా కల్పించారు. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా ఆయన జిల్లాలో పర్యటిస్తూ క్యాడర్‌కు అండగా నిలుస్తున్నారు. 

రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర కూడా జిల్లా కేంద్రంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పర్యటనలు, పరామర్శలు కాంగ్రెస్‌ను ఓడించడం అంతా తేలికకా దు. ప్రత్యేక ఎత్తుగడలతోనే ఖమ్మం లో కారు స్పీడు పెరుగుతుంది.

మహబూబ్‌నగర్‌లో పంచాయతీ పాలిటిక్స్ షూరూ!

ఓటర్ల ప్రసన్నం, పార్టీల మద్దతు కోసం ఆశావహుల ప్రయత్నాలు 

మహబూబ్‌నగర్, నవంబర్ 24 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ప్రసన్నం కోసం, పార్టీల మద్దతు కోసం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది.

ఇటు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కూడా తమ సత్తా చాటేందుకు అడుగులు వేస్తున్నారు. పదవి చేపట్టాలనే ఆశతో ఉండి, ఖర్చుకు వెనుకాడని నేతలు పార్టీల మద్దతు కోసం అంతర్లీనంగా చర్చలు చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు గట్టి పోటీ ఉండగా సర్పంచ్ ఎన్నికలకు ఈ పోటీ మరింత రెట్టింపు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ప్రణాళిక రచించుకుని, ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయానికి ఎలాంటి ఆందోళన లేకుండా గెలుపుగుర్రాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎన్నికల్లో బరిలో నిల్చుండేందుకు ఆశగా ఉన్నారు.

బీఆర్‌ఎస్ సైతం తన బలం పెంచుకునేలా ప్రయత్నాలు ముమ్మ రం చేస్తున్నది. బీజేపీ, ఇతర పార్టీలు సైతం పోటీ ఇచ్చేందుకు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.