calender_icon.png 5 January, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పగ్గాలు బీసీలకిస్తారా?

03-01-2025 01:53:23 AM

* అధికారం పోయాక గుర్తుకు వచ్చారా? 

* పదేళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారు?

* ఎమ్మెల్సీ కవిత వీటికి సమాధానం చెప్పి ధర్నా చేయాలి

* స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి కొంతు కోశారు

* బీసీల పేరిట కపటనాటకం ఆపండి

* పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

* కవితకు 15 ప్రశ్నలు వేసిన పీసీసీ చీఫ్

హైదరాబాద్, జనవరి ౨ (విజయక్రాం తి): అధికారం పోయిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం బీసీల పట్ల మొసలికన్నీరు కారుస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమా ర్‌గౌడ్ మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి  బీసీలను వంచించడమే కాకుండా, వారికి న్యాయంగా అందాల్సిన నిధులను కూడా ఏ ఒక్క సంవత్సరంలోనూ ఖర్చు చేయకుండా నిలువునా ముంంచారని ధ్వజమెత్తారు.

అధికారం పోయిన తర్వాత బీఆర్ ఎస్‌కు బీసీలు గుర్తుకొచ్చారా? బీసీలకు పార్టీ పగ్గాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. అభిమానం ఉంటే పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్‌ఎస్ హయాం లో చేపట్టిన చర్యలు, ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనలో చేపట్టిన చర్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఎమ్మెల్సీ కవితకు, బీఆర్‌ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు.

ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసే ముందు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారో చెప్పాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే బీసీలకు మేలు జరుగుతుందని స్పష్టంచేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు బీఆర్‌ఎస్ అన్యాయం చేసి, వారి గొంతు కోసిందని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో మరక అంటించుకున్న ఎమ్మెల్సీ కవిత.. పార్టీలోనూ ప్రాధాన్యం తగ్గడంతో ఆమెకు ఎటూ పాలుపోవడం లేదని, అందు కే రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి బీసీల పేరిట కపటనాటకం మొదలు పెట్టారని దుయ్యబట్టారు.

ఇందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడుతున్నా రని ధ్వజమెత్తారు. విజ్ఞులైన బీసీలు ఈ కుట్రలను గమనించి ఈ ధర్నాకు ఎవరూ వెళ్లవ ద్దని, బీఆర్‌ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

బీసీలకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందనడానికి తనను పీసీసీ చీఫ్‌గా నియమించడమేకాకుండా, క్యాబినెట్‌లోనూ పలువురికి ప్రాధాన్యం ఇవ్వడమే నిదర్శనమ ని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో బీసీ మంత్రులకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అం దరికీ తెలిసిందేనని అన్నారు. బీసీలను అడుగడుగున అణగదొక్కిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని దుయ్యబట్టారు.

తన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాకే కవిత ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, వారికి మరింత ప్రయోజనకరంగా ఉండేలా సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి.. ధర్నా చేపట్టడం దురదృష్టక రమని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ కవితకు పీసీసీ చీఫ్ 15 ప్రశ్నలు

* కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక ఎన్నికల్లో ప్రస్తుత రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచడానికి చర్యలు తీసుకొని, ఇందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా?

* బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా? 

* స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకా?

* స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి ప్రజాప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకా?

* జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ర్టంలో కులగణన చేపట్టినందుకా? 

* గత బీఆర్‌ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్‌ను రూ.2,971.32 కోట్లకు పెంచినందుకా? 

* కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకా?

* గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకా?

* బీసీ సామాజికవర్గానికి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకా?

* ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించినందుకా?

* మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5,136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకా?

* బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం రూ.100 కోట్లు కేటాయించినందుకా?

* గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ చార్జీలు 40 శాతానికి పెంచినందుకా?

* 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్స్ నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకా?

* బీసీ కార్పొరేషన్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.73 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా?