calender_icon.png 9 January, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసు బయటకు వచ్చేనా?

02-01-2025 02:15:18 AM

  1. క్రియాశీల రాజకీయాలకు గులాబీ అధినేత ఇంకెంతకాలం దూరం
  2. కేసీఆర్ ప్రజల్లోకి వస్తే స్థానిక పోరులో సత్తా చాటొచ్చునంటున్న బీఆర్‌ఎస్ శ్రేణులు

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారా? పార్టీ పగ్గాలు ఇతరులకు అప్పగిస్తారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. 2025లో బీఆర్‌ఎస్‌కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నట్టు పేర్కొన్నారు. 2001 పార్టీ ఆవిర్భావం నుంచి అధ్యక్షుడిగా కొనసాగిన కేసీఆర్ ఇక క్రియాశీల రాజకీయాలకు దూరమవుతారా? అనేది పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది.

మరోపక్క పార్టీ పగ్గాలను ఇతరులకు ఇవ్వబోరని, కుటుంబ సభ్యులకే అప్పగిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత స్థానాన్ని కేటీఆర్‌కే అప్పగిస్తారని, వర్కింగ్‌ప్రెసిడెంట్ పదవి హరీశ్‌రావు, కవితలో ఒకరికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు ప్రస్తుతం ప్రభుత్వ పోకడలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

దళితుడికి అప్పగిస్తారా?

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని గతంలో మాట ఇచ్చిన కేసీఆర్.. ఆ హామీని నెరవేర్చేందుకు పార్టీ బాధ్యతలు ఎస్సీ నేతలకు అప్పగించాలన్న చర్చా నడుస్తోంది. ఈ క్రమంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకు అధ్యక్ష పదవి అప్పగిస్తే ఎలా ఉంటుందనే చర్చ కొనసాగుతోంది.

ఇదిలాఉండగా బీసీ నినాదంతో రేవంత్ సర్కార్ దూకుడుగా వెళ్తుంది. ఓ వైపు కులగణన బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశం భుజాన ఎత్తుకుంది. దీంతో ఎమ్మెల్సీ కవిత బీసీ జపం మొదలుపెట్టారు. అటు బీజేపీలో కూడా బీసీ సీఎం నినాదం వినిపిస్తోంది. వచ్చే ఎన్నిక ల్లో బీసీలు నిర్ణయాత్మకశక్తిగా మారుతారనే టాక్ బలంగా వస్తోంది.

దీంతో బీసీ నేతకు బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి అప్పగిస్తారనే మరో చర్చా మొదలైంది. పార్టీ అధ్యక్షుడిగా కుటుంబ సభ్యులను కాకుండా ఇతరులకు అప్పగిస్తే కుటుంబంలో జరుగుతున్న అంతర్గత కలహాలకు చెక్ పడుతుందని, దీంతో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు ఒకే తాటి మీదకు వస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు.

కేసీఆర్ బయటకు వస్తే..

రాష్ట్రంలో ఈ నెలాఖరులో స్థానిక ఎన్నికలకు, అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ, తరువాత జీహెచ్‌ఎంసీ పోరు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలంటే ప్రభుత్వానికి దీటుగా ప్రచారం తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రచారానికి నడుంబిగిస్తే ఆశించిన స్థాయిలో సీట్లు సాధిస్తామని సీనియర్ నేతలు భావిస్తు న్నారు.

ఆయన ఎక్కడ సభ నిర్వహించినా.. లక్షలాది మంది జనం కదిలిరావడం సాధారణ విషయమే. మళ్లీ ప్రజల వద్దకు వస్తే పార్టీ ఉనికి కాపాడుకోవ డంతోపాటు కాంగ్రెస్ పార్టీని  దెబ్బతీయవచ్చని అంచనా వేస్తున్నారు.

ఆరు గ్యారెంటీల అమలు, వృద్ధుల పింఛన్లు, రైతు భరోసా, మహిళలకు రూ.2500 పథకాలు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి అమలులో చేస్తున్న జాప్యాన్ని ఎండగడితే బీఆర్‌ఎస్‌ను ప్రజలు మళ్లీ ఆదరిస్తారని పేర్కొంటున్నారు.