- 2025-26 బడ్జెట్ ఆమోదానికి నేడు కౌన్సిల్ సమావేశం
- బీఆర్‌ఎస్, బీజేపీ పాత్రలపై ఆసక్తికర చర్చ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఏడాదికాలంగా జరిగిన రాజకీయ పరిణామాలు జీహెచ్‌ఎంసీపై ప్రభావం చూపాయి. 2020, డిసెంబర్ 1న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన గద్వాల విజయలక్ష్మీ, మోతె శ్రీలతశోభన్ రెడ్డి మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
అనంతరం రాష్ట్రంలో అధికార మార్పిడితో ఏడాదికాలంగా గ్రేటర్‌లోనూ పొలిటికల్ సీన్ మారింది. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌కు అనుగుణంగా మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తయ్యాకే అవిశ్వాసం పెట్టే చాన్స్ ఉంది. కానీ వీళ్ల పదవీకాలం నాలుగేళ్లు నిండటానికి మరో 11 రోజుల గడువు ఉంది. దీంతో గురువారం జరిగే బల్దియా కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది.
2024, జూలై 6న జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌కే బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు పరిమితమయ్యారు. 2025, ఫిబ్రవరి 10 నాటికి నాలుగేళ్లు పూర్తయ్యాకే అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నాలుగేళ్లు గడువు ముగియ జనవరి 30న కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్ నిర్ణయించడం విశేషం.
సంఖ్యా బలం ఇలా..
2020 డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 56, కాంగ్రెస్‌కు 3, బీజేపీకి 47, ఎంఐఎం పార్టీలు 44 స్థానాలు లభించాయి. ప్రస్తుతం 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఫిరాయింపుల అనంతరం ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకొని కాంగ్రెస్‌కు 24+5 (29), బీఆర్‌ఎస్‌కు 42+29 (71), బీజేపికి 39+6 (45), ఎంఐఎంకు 41+10 (51) మంది సభ్యులు ఉన్నారు.
జీహెచ్‌ఎంసీ యాక్ట్ ప్రకారం కౌన్సిల్ నిర్వహణకు ఎక్స్‌అఫీషియోతో కలిపి మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు (131) మంది సభ్యుల అటెండెన్స్ ఉండాలి. అవిశ్వాసం పెట్టేందుకు మాత్రం ముందుగా కనీసం 50 శాతం సభ్యుల (98) సంతకాలతో కలెక్టర్‌కు ముందస్తు సమాచారమివ్వాలి.
అవిశ్వాసం సమయంలో కచ్చితంగా 2/3 సంఖ్యా బలం ఉండాలి. ప్రస్తుతం బల్దియాలో పార్టీల బలాబలాలు చూస్తే.. ఏ పార్టీకి కావాల్సినంత బలం లేదు. సాధారణ అసెంబ్లీ, పార్లమెంట్ సభల్లో అధికార పార్టీ తమకు బలం ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
బల్దియాలో అవిశ్వాసం పెట్టినవారే తమ మెజార్టీ బలంతో ఓడించాల్సి ఉంటుంది. అవిశ్వాసం వీగిపోతే మరో ఏడాది దాకా అవిశ్వాసానికి తావు లేదు. మేయర్ గద్వాల విజయలక్ష్మీకి మరో ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి.
ఆమోదం లభించేనా?
ఈ ఏడాది గ్రేటర్ బడ్జెట్ రూ.8,440 కోట్లుగా ముసాయిదాను బల్దియా రూపొందించింది. స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందింది. బడ్జెట్‌కు ఆమోదం లభించకుంటే 2025 ఏడాదికి అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. ఇది కార్పొరేటర్లకే రాజకీయంగా నష్టం చేకూరుస్తుంది. ఈ కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్, బీజేపీలు ఐక్యతారాగం తీస్తాయో.. లేదో చూడాలి.
ఎంఐఎం మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు గత కౌన్సిల్ సమావేశం లాగానే అవిశ్వాసం అనే మాట కాకుండా ఈసారి కూడా మేయర్, డిప్యూటీ మేయర్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో నేడు బల్దియా కౌన్సిల్‌లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, సెక్యూరిటీ పరంగా ఒకవైపు పోలీసులు, మరో వైపు డీఆర్‌ఎఫ్ బృందాలతో బల్దియా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు.