calender_icon.png 22 January, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొత్తు ముందుకు సాగేనా?

22-10-2024 03:09:36 AM

  1. జార్ఖండ్‌లో ఇండియా కూటమిలో లుకలుకలు
  2. కాంగ్రెస్, జేఎంఎం సీట్ల కోసం కుస్తీ
  3. హస్తం నేతలకు మింగుడుపడని జేఎంఎం చర్యలు
  4. కేటాయించిన సీట్లపై ఆర్జేడీ అసంతృప్తి

రాంచీ, అక్టోబర్ 21: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల శంఖారావం మోగింది. నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా 81 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాగైనా ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఇప్పటికే 66 మందితో తొలి జాబితా విడుదల చేసింది. అయితే కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు మాత్రం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను పక్కన పెట్టి సీట్ల విషయంలో కుస్తీలు పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కేటాయించిన సీట్ల విషయంలో పేచీలు పెట్టుకుంటున్నాయి.

కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీలు 70 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ శనివారం రోజు ప్రకటించారు. మిగిలిన 11 స్థానాల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)తో పాటు ఇతర మిత్రపక్షాలు పోటీ చేస్తాయని తెలిపారు. ఈ ప్రకటనపై ఆర్జేడీ అసహనం వ్యక్తం చేసింది.

దీనిపై ఆ పార్టీ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ ఈ సీట్ల కేటాయింపును పూర్తిగా ఏకపక్ష నిర్ణయంగా అభివర్ణిస్తూ బహిరంగంగానే దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఆదివారం రాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

సీట్ల కేటాయింపులో 12-13 సీట్ల కంటే తక్కువ సీట్లు కేటాయిస్తే తమ పార్టీకి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. సుమారు 18 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీకి మంచి పట్టుందన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగితే.. 60-62 స్థానాల్లో విపక్ష కూటమి సభ్యులకు ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. 

తొలుత సీట్ల కేటాయింపు ఇలా

కాంగ్రెస్-జేఎంఎం పార్టీల మధ్య తొలుత కుదిరిన ఒప్పందం ప్రకారం 81 స్థానాల్లో 50 స్థానాలను జేఎంఎం పార్టీకి కేటాయించారు. మిగిలిన 31 స్థానాలను కాంగ్రెస్ తీసుకుంది. జేఎంఎంకు పొందిన 50 స్థానాల్లో కొన్నింటిని లెప్ట్ పార్టీలకు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పొందిన 31 స్థానాల్లోని కొన్ని సీట్లను ఆర్జేడీకి కేటాయించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో తమకు కేవలం 11 స్థానాల్లోనే పోటీ చేయాల్సి వస్తుండటంతో ఎక్కువ సీట్లు కావాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. జేఎంఎంకు కేటాయించిన సీట్లలోంచి వాటా కోరుతుంది. అయితే దీనిపై జేఎంఎం అసహనం వ్యక్తం చేసింది. సీట్ల విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతోందని అభిప్రాయపడింది.

ఆర్జేడీకి ఎక్కువ సీట్లు కావాల్సి వస్తే.. కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లో నుంచి తీసుకోవాల్సిందిగా సూచించింది. జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీలు కలిసే పని చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. 2020 బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ తమ పార్టీకి కనీసం మూడు సీట్లు కూడా కేటాయించలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా జేఎంఎం గుర్తు చేసింది. 

గుర్రుగా హస్తం నేతలు

హర్యానాలో ఓటమి చెందినప్పటికీ జార్ఖండ్‌లో ఎలాగైనా గెలవాలని పని చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ జేఎంఎం నేతల చర్యలు తమకు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయని ఆరోపిస్తున్నారు. బీజేపీకి చెందిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు ముందుగా సుముఖత వ్యక్తం చేసినట్టు చెప్పారు.

కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతుండగానే ఆ ఎమ్మెల్యేలతో జేఎంఎం నేతలు డీల్ కుదుర్చుకుని తమ పార్టీలో చేర్చుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనంత్ ప్రతాప్‌దేవ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని ఆ తర్వాత అందులో నుంచి కూడా బయటకు వచ్చి జేఎంఎంలో చేరినట్టు వెల్లడించారు.

తమ పార్టీని కాదని వెళ్లిన ప్రతాప్‌దేవ్‌కు జేఎంఎం టికెట్ ఇచ్చేందుకు రెడీ అయిందని ఆరోపించారు. ఇది పొత్తు ధర్మం కాదని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. అనంత్ ప్రతాప్‌కు జేఎంఎం కేటాయించిన స్థానం లో కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మానస్ పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు ఏళ్లుగా పని చేస్తున్నట్టు వివరించారు.

ఇవేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్‌ను అవమానించి పార్టీని వీడిన నేతకు జేఎంఎం సీటు కేటాయించడం సరికాదన్నారు. పార్టీ పోటీ చేసే స్థానాలు 29 నుంచి 25 కు తగ్గే పరిస్థితి కనిపిస్తుందని మరో సీనియర్ నేత ఆరోపించారు.

ఒకవేళ ఇదే జరిగితే హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పదవిలో కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ తీవ్రం గా శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పోటీ చేసే సీట్ల విషయంలో స్పష్టత కోసం హేమంత్ సోరెన్, కేసీ వేనుగోపాల్ మధ్య చర్చలు జరిగినట్టు చెప్పారు. అయినప్పటికీ సీట్ల విషయం కొలిక్కి రాలేదన్నారు.