calender_icon.png 16 January, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియా చేజేతులా

07-08-2024 04:17:49 AM

గురువారం స్పెయిన్‌తో కాంస్య పతక పోరు

పారిస్: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో పరాజయం పాలైంది. మంగళవారం జరిగిన సెమీస్‌లో టీమిండియా 2 తేడాతో జర్మనీ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరాలన్న ఆశలకు ఈసారి కూడా గండిపడింది. సెమీస్‌లో ఓటమితో భారత్ కాంస్య పతక పోరుకు సిద్ధమైంది. గురువారం జరగనున్న బ్రాంజ్ మెడల్ పోరులో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (ఆట 7వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (36వ ని.లో) గోల్స్ సాధించారు. జర్మనీ తరఫున గొంజాలో (18వ ని.లో), క్రిస్టోఫర్ (27వ ని.లో), మార్కో (54వ ని.లో) గోల్స్ అందించారు.

అయితే ఆట ఆరంభం నుంచే మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఒక్కో గోల్ కోసం ఇరుజట్లు చాలా శ్రమించాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ మరోసారి గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. అయితే రెండో క్వార్టర్స్‌లో జర్మనీ గోల్ చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. ఆ వెంటనే పెనాల్టీ స్ట్రోక్‌ను సద్వినియోగం చేసుకుంటూ క్రిస్టోఫర్ గోల్ కొట్టడంతో జర్మనీ 2 ఆధిక్యంలో వెళ్లిపోయింది. మూడో క్వార్టర్స్‌లో సుఖ్జీత్ సింగ్  రెండో గోల్ అందించడంతో భారత్ 2 స్కోరును సమం చేసింది. మూడు, నాలుగు క్వార్టర్స్‌లో పలుమార్లు గోల్ పోస్టులపై దాడి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

అయితే చివర్లో గోల్ కీపర్ శ్రీజేశ్‌తో భారత ఆటగాళ్ల సమన్వయ లోపం కారణంగా జర్మనీకి మరో గోల్ రావడంతో భారత్ ఓటమి ఖాయమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇదే జర్మనీపై నెగ్గిన హర్మన్ సేన కాంస్యం గెలిచింది. తాజా ఒలింపిక్స్‌లో సెమీస్‌లో టీమిండియాపై నెగ్గి జర్మనీ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఫైనల్ చేరాలన్న ఆశలు తీరనప్పటికీ.. స్పెయిన్‌తో మ్యాచ్‌లోనైనా గెలిచి కనీసం కాంస్యంతో తిరిగిరావాలని కోరుకుందాం.