calender_icon.png 15 January, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండ్రోజుల్లో రాజీనామా చేస్తా

16-09-2024 05:17:08 AM

  1. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన
  2. నిర్దోషిగా నిరూపించుకునేవరకు పదవిలో ఉండనని స్పష్టం
  3. కొత్త సీఎం ఎంపికపై మూడ్రోజుల్లో సమావేశం.. 
  4. తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: లిక్కర్ పాలసీ కేసులో బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన చేశారు. మనీలాం డరింగ్ కేసులో తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకూ సీఎం పదవిలో ఉండనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీలో ఆదివారం పార్టీ కార్యాలయం లో ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజీనామా నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు.

తమ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే తమను ముందుకు నడిపించాడని పేర్కొన్నారు. భగవంతుడు ఇచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడుతామని చెప్పారు. సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ వంటి ఆప్ నేతలు ఇంకా జైలులోనే ఉన్నారని, త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని చెప్పారు. కొత్త సీఎం ఎంపికపై మూడ్రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహించి ప్రకటిస్తామని తెలిపారు. 

ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు

ఆమ్‌ఆద్మీ పార్టీలో చీలికలతో ఇబ్బందులు సృష్టించి బీజేపీ అధికారంలోకి రావాలనుకుంది. పార్టీని ముక్కలు చేయడానికే నన్ను జైలుకు పంపారు. ఎన్ని కుట్రలు చేసినా ఆప్‌ను బీజేపీ విచ్ఛిన్నం చేయలేకపోయింది. జైలులో పెట్టి నన్ను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇప్పటివరకు రాజీనామా చేయలేదు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చని సుప్రీంకోర్టు సైతం చెప్పింది అని కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని, కానీ మహారాష్ట్రతో పాటు నవంబర్‌లో నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతానని, తాను నిర్దోషినని ప్రజలు నమ్మితే ఓట్లు వేయాలని, ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని ఉద్ఘాటించారు. బీజేపీయేతర ప్రభు త్వాలను కూలగొట్టేందుకు బీజేపీ కొత్త గేమ్ మొదలుపెట్టిందని, ఇందులో భాగంగానే కర్ణాటకలో సిద్ధరామయ్య, కేరళలో విజయన్, బెంగాల్‌లో మమతపై కేసులు నమోదు చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. కేసులు నమోదు చేసినంత మాత్రాన రాజీనామా చేయొద్దని ఆ సీఎంలందిరికీ సూచించారు. 

48 గంటల రహస్యమేంటి?

కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేదీ, ఢిల్లీ పార్టీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అవినీ తితో దేశరాజధానిలో ప్రభుత్వాన్ని శూన్యంలోకి నెట్టిందని మండిపడ్డారు. జైల్లో ఉన్నప్పు డు చేయని రాజీనామా ఈ రెండ్రోజుల్లో చేస్తానని చెప్పడమేంటో? ఈ 48 గంటల్లో ఉన్న మర్మమేంటోనని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో ఏవైనా వ్యవహారాలు సర్దుబాటు చేసుకుంటారా? ముందస్తు ఎన్నికలు కోరడంపైనా మరో కొత్త అనుమానం తలెత్తుతోంది అని త్రివేదీ విమర్శలు చేశారు.

కేజ్రీవాల్ భార్య సునితను సీఎంగా చేయడానికే ఈ డ్రామా అని, పార్టీ నేతలను ఒప్పించేందుకే రెండ్రోజుల సమయం అడిగారని మరో బీజేపీ నేత మంజీందర్‌సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సైతం కేజ్రీవాల్ నిర్ణయంపై విమర్శలు గుప్పించింది. ఇదొక పొలిటికల్ స్టంట్ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ అన్నారు. సుప్రీంకోర్టు షరతుల వల్ల సీఎంగా కేజ్రీవాల్‌కు ఎలాంటి అధికారాలు లేవని, అందుకే రాజీనామా పేరుతో వైదొలుగుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్లపై ఈ డ్రామా ఎలాంటి ప్రభావం చూపదని ఎద్దేవా చేశారు.