calender_icon.png 21 April, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ స్వగృహ ఇళ్లు, స్థలాలు వేలం?

13-12-2024 12:49:25 AM

  1. డిసెంబర్‌లో దశలవారీగా విక్రయించేందుకు సమాయత్తం 
  2. రూ. 2 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయం 
  3. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలు, ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్‌లో దశల వారీగా అమ్మకాలు చేపట్టేందుకు రాష్ట్ర గృహ నిర్మా ణ సంస్థ కసరత్తు మొదలు పెట్టింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, బహుళ అంతస్తుల అమ్మకం ద్వారా రూ. 2 వేల కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోవాలని  సర్కార్ భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గృహ కార్పొరేషన్‌ను చేసింది. దీని ద్వారానే ఇళ్ల నిర్మాణంతో పాటు ప్లాట్ల విక్రయం కూడా చేపట్టాలని నిర్ణయించింది.

ఈ కార్పొరేషన్‌కు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూముల ను కూడా బదలాయించింది. అనంతరం పలు నిర్మాణాలు చేపట్టి విక్రయాలు కూడా జరిపింది. అనంతరం పలు నిర్మాణాలు చేపట్టి అమ్మిం ది. అయితే కొన్ని కారణాలతో అప్పట్లో పెద్ద మొత్తంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు మిగిలిపోయాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది, ఈ పథకం అమలుకు నిధులను సమకూర్చుకునేందుకు రాజీవ్‌స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులను విక్రయించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో స్థలాలు, నిర్మాణాలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసేందుకు మూడు ఉన్నతస్థాయి కమిటీలను నియమించింది.

ఆయా కమిటీలు ఇటీవలే ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చాయి. వాటిపై సమీక్షించిన అనంతరం దశల వారీగా రాజీవ్‌స్వగృహ, స్థలాలను దశల వారీగా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతకుముందే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని తీసుకున్న ప్రభుత్వం.. వాటి రిపేర్లకు  నిధులను కూడా విడుదల చేసింది.

గ్రేటర్ పరిధిలోనే ఎక్కువగా ఇళ్లు..  

 ఈ రాజీవ్ స్వగృహ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ( జీహెచ్‌ఎంసీ)  పరిధిలోనే ఉన్నాయి. ప్రభుత్వం అంచనా వేసిన రూ. 2 వేల కోట్లలో రూ. 1,600 కోట్ల నుంచి రూ. 1,700 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రేటర్ పరిధిలోనే ఆదాయం వస్తుందనే అంచనాతో ఉన్నారు. ఇక్కడ 760 ప్లాట్లు ఉండగా, పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్స్ కూడా నిర్మించారు. వాటిలో 36 అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు.

వీటితో పాటు 26 టవర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారం, జవహర్‌నగర్, పోచారంలో ఉండగా, 8 టవర్లు ఖమ్మం పట్టణంలో ఉన్నట్లు తేల్చారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లు, ప్లాట్లు మొత్తం కలిపి 1,703 ఉన్నాయి. మహబూబ్‌నగర్, కామారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్,  గద్వాల, అదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాలలో 1,361  ప్లాట్లు  ఉండగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో 342 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. 

కార్పొరేషన్ పరిధిలో 136 ఎకరాలు

ఇదిలా ఉండగా, ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు  136 ఎకరాల భూమి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ భూమిని వేలం వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 65 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 53 ఎకరాలు, ఖమ్మం, కామారెడ్డి జిల్లాలలో 18 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు.