calender_icon.png 18 November, 2024 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వదలరు.. కదలరు!

18-11-2024 01:14:00 AM

  1. వాణిజ్య పన్నుల శాఖలో ఏడేళ్లుగా బదిలీల్లేవ్ 
  2. ప్రమోషన్లు, పోస్టింగ్‌లపైనే ఆసక్తి 
  3. డిప్యూటేషన్లతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు 
  4. ఉన్నచోటనే ఏండ్లకేళ్లు తిష్ట 
  5. బదిలీ కోసం 2 వేల మంది ఎదురుచూపు

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ఏ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు అయినా ప్రమోషన్లు, పోస్టింగ్‌లు, బదిలీలు  సర్వసాధారణం. కానీ, వాణిజ్య పన్నులశాఖలో కొన్నేళ్లుగా అం దుకు విరుద్ధంగా జరుగుతోందని కొంద రు ఉద్యోగులు చెప్తున్నారు.

ఈ విభాగంలో ప్రమోషన్లు ఉంటాయి.. పోస్టింగ్ లు కూడా ఉంటాయి.. కానీ, జనరల్ ట్రాన్స్‌ఫర్లు మాత్రం ఉండవు. జిల్లాస్థాయి ఆఫీసుల నుంచి హెడ్డాఫీస్ వరకు కొందరు అధికారులు, ఉద్యోగులు, పీఏలు ఏడెనిమిదేళ్లుగా తిష్ట వేశారు. వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో ఓ సీనియర్ ఆఫీసర్ అయితే ఏకంగా 15 ఏళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.

ఎన్నో ఏళ్లుగా పాతు కుపోయిన వారు.. ఉన్న చోటు నుంచి కదిలేందుకు ఏమాత్రం ఇష్ట పడటం లేదు. ఉన్నతాధికారులు అండదండలో.. లేదా చూసీచూడనట్టుగా ఉండ టం వల్లనో ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైన వారికి డిప్యూటేషన్లతో సరిపెడుతున్నారు. ఈ డిప్యూటే షన్లతో కూడా కొందరు స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి.

రిమోట్ జిల్లా సర్కిళ్లలో పనిచేసే కొందరు అధికారులు.. అక్కడ వసూళ్లు ఉండవన్న కారణంతో ప్రైమ్ ఏరియాల్లో డిప్యూటేషషన్లపై పని చేస్తున్నట్టు సమాచారం. ఆ డిప్యూటేషన్లపై కూడా ఏళ్లకు ఏళ్లు పనిచేస్తున్న వారు ఉండటం గమనార్హం.

కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా అటెండర్, పీఏ స్థాయి నుంచి ఏసీటీవో వరకు.. డీసీటీవో నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు ఏడేళ్లుగా సాధారణ బదిలీలే లేవని ఉద్యోగులు చెప్తున్నారు. కొందరు అధికారులు, సిబ్బంది, ఉద్యోగుల స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం కావాలనే సాధారణ బదిలీలు జరగకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రైమ్ సెంటర్లలో పనిచేసేందుకే మొగ్గు

వసూళ్లకు అలవాటు పడిన కొందరు అధికారులు, పీఏలు.. తమ పరపతిని ఉపయోగించి ఎనిమిదేళ్లుగా సాధారణ బదిలీలను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారు ప్రైమ్ ఏరియాల్లో పనిచేసేందుకే ఆసక్తిని కనబరుస్తున్నారు. వ్యాపారం, వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువ ఉన్న చోట వాణిజ్య పన్నుల శాఖకు పని కూడా బాగా ఉంటుంది.

ఈ క్రమంలో అక్రమ వసూళ్లు కూడా ఆయా ప్రాంతాల్లోనే మంచిగా ఉంటాయన్న ప్రచారం ఉంది. రాష్ట్రంలో వ్యాపారం, వాణిజ్యం బాగా నడిచేది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే అనేది అందరికి తెలిసిందే. అందుకే ఈ ప్రాంతాల్లో పని చేసేందుకు ఎక్కువ మంది ఉద్యోగులు, అధికారులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

అలాగే, జిల్లాల్లో కూడా వసూళ్లు మంచిగా ఉన్న సర్కిళ్లు కొన్ని ఉన్నాయి. అందుకే వసూళ్లకు అలవాటు పడిన కొందరు ఉద్యోగులు కూడా అక్కడి నుంచి కదిలేందుకు ఇష్టం పడటం లేదు.

ప్రమోషన్లను సైతం వద్దంటున్న వైనం

వాణిజ్య పన్నుల శాఖలో కొందరు సీనియర్ అధికారులకు ప్రమోషన్ వస్తే.. కచ్చితంగా బదిలీ కావాల్సి ఉంటుంది. అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారులు సర్కిళ్లలో పనిచేయడానికి పోస్టింగ్ ఉండదు. ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి లాంటి ప్రైమ్ ఏరియాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు ఉన్నత స్థాయి ప్రమోషన్లు వచ్చినా వసూళ్లకు అలవాటు పడి ఆ ప్రమోషన్లను సైతం వద్దంటున్న ఉదంతాలు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌ంట్‌లో ఉన్నాయి. వారు తమ ప్రమోషన్స్ ఆపించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పదోన్నతులను ఆపేందుకు సహకరించాలని సహోద్యోగులకు ఇటీవల లేఖలు రాసినట్టు వార్తలు వచ్చాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఆశలు 

కొందరు స్వార్థం కోసం బదిలీలను అడ్డుకోవడం వల్ల తాము ఏళ్లు గా నష్టపోతున్నామని సాధారణ ఉ ద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నా రు. రాష్ట్రవ్యాప్తంగా అటెండర్, పీఏ స్థాయి నుంచి ఏసీటీవో వరకు దా దాపు 2 వేల మంది, డీసీటీవో నుం చి అడిషనల్ కమిషనర్ స్థాయి వర కు 70 మంది అధికారులు, ఉద్యోగు లు ఉన్నారు. వీరిలో మెజార్టీ శాతం బదిలీలను కోరుకుంటున్నారు.

వాస్తవానికి అటెండర్ నుంచి సీటీవో వర కు సాధారణ బదిలీలు కమిషనర్ పరిధిలోనే ఉంటాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. కానీ, గతంలో పనిచేసిన కమిషనర్లు తమ జనరల్ ట్రాన్స్‌ఫర్లను పట్టించుకోవడం లేద ని చెప్తున్నారు. ఇప్పుడున్న కమిషనర్ అయినా తమ బదిలీలపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆదాయం తెచ్చే శాఖలతో ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ స మావేశంలో ఏళ్లుగా కార్యాలయాల్లో తిష్టవేసిన ఆఫీసర్ల అంశాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ క్రమంలో ఎక్కువ కాలంగా పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలని సీఎం ఆదేశించా రు. సీఎం ఆదేశాలను సైతం ఉన్నతాధికారులు పాటించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. తమ సమస్య సీఎం దృష్టిలో ఉన్నందున.. ఈ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నామని సాధారణ ఉద్యోగులు అంటున్నారు.