calender_icon.png 20 January, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో మోదీని కలుస్తా

19-09-2024 03:28:56 AM

ఆయనో అద్భుతమైన వ్యక్తి

మిషిగన్ సభలో ట్రంప్ ప్రకటన

భారత్‌తో వాణిజ్య సంబంధాల పైనా కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్, సెప్టెంబర్ 18: శనివారం నుంచి అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్రమోదీతో తాను భేటీ అవుతానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిషిగన్‌లో నిర్వహించిన ఓ సభలో అమెరికా, భారత్ వాణిజ్య సంబంధాలపై మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. మోదీ అద్భుతమైన వ్యక్తి. ఆయన వచ్చేవారం అమెరికా వస్తున్నారు. నేను ఆయన్ను కలవబోతున్నా. ఆయనో అద్భుతం అని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అయితే ఎక్కడ, ఏ సందర్భంలో కలుస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత సంతతి ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు పలువురు భావిస్తున్నారు. ఇదే వేదికపై రెండు దేశాల వాణిజ్య సంబంధాలపైనా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిగుమతులపై భారత్ భారీ సుంకాలను విధిస్తోందని అన్నారు. సుంకాలు విధించేవారు ఎంతో తెలివైన వారని, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భారత్, బ్రెజిల్ ఎంతో కఠినమైనవని, చైనా అన్నింటికంటే కఠినంగా ఉంటుందని చెప్పారు. కానీ సుంకాల విషయంలో చైనాతో జాగ్రత్తగా ఉంటామని స్పష్టం చేశారు.