calender_icon.png 3 October, 2024 | 3:56 AM

కేటీఆర్ తల్లి, చెల్లి, భార్య, బిడ్డ బాధపడరా?

03-10-2024 01:48:46 AM

సురేఖ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం

అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడరే: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

సురేఖ మాటలపై మహిళగా సిగ్గుపడుతున్నా: మాజీ ఎంపీ మాలోత్ కవిత

తెలంగాణ భవన్‌లో మీడియాతో బీఆర్‌ఎస్ మహిళా నేతలు

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. మంత్రి పదవిలో ఉండీ బాధ్య తారహితంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు.

మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ తల్లి, చెల్లి, భార్య, బిడ్డ బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించారా? అని ప్రశ్నించారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుందని, కేటీఆర్ గురించి మంత్రి సురేఖ మాట్లాడింది ఆక్షేపణీయమమని అన్నారు.

రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, ఆరోపణలకు తిరిగి ఆస్కారం ఇవ్వకూడదని హితవు పలికారు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలని.. సమాజానికి ఆదర్శంగా ఉం డాలని కొండా సురేఖకు సబితా సూచించారు.

సబితాపై రేవంత్ విమర్శలపై మాట్లాడలే ? : సత్యవతి రాథోడ్

బీఆర్‌ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను ఓర్వలేక కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. ‘అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని’ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అంటే మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దాడులపై కొండా సురేఖ, సీతక్క ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కొండా సురేఖపై జరిగిన ట్రోల్‌పై హరీశ్‌రావు ఖండించారని తెలిపారు. తనపై జరిగిన ట్రోల్‌పై కొండా సురేఖ మాట్లాడుతున్నారని.. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ నేతలను అనేక రకాలుగా ట్రోల్స్ చేశారని సత్యవతి గుర్తు చేశారు.

సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తున్నారని విరుచుకుపడ్డారు. సినిమా పరిశ్రమను కించపరిచే విధంగా కొండా సురేఖ మాట్లాడారని విమర్శించారు. కొండా సురేఖ ఇట్లాగే మాట్లాడితే కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు.

మహిళా మంత్రులను శిఖండిలా అడ్డం పెట్టుకుని రేవంత్‌రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇంతటి సంస్కారహీనమైన మాటలు ఎన్నడూ వినలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో కొండా సురేఖ ఏం మాట్లాడారో అందరికి తెలుసని చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై సినిమా ఇండ్రస్ట్రీలో ఉన్న మహిళలు స్పందించాలని కోరారు. 

కొండా సురేఖ నాలుక చీరెస్తాం మాజీ ఎంపీ మాలోత్ కవిత 

కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల మహిళగా సిగ్గుపడుతున్నానని మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. కేటీఆర్‌పై ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. నాగార్జున, సమంతను ఎన్ని సార్లు రోడ్డుకు ఈడుస్తారని ప్రశ్నించారు. రాష్ర్ట మంత్రి అనే స్థాయిని మర్చిపోయి సురేఖ మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇలాంటి వారి నోళ్లను యాసిడ్‌తో శుభ్రం చేయాలన్నారు. కొండా సురేఖపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. హైడ్రాతో పడిపోతున్న గ్రాఫ్‌ను కాపాడుకోవడం కోసం కొండా సురేఖ, సీతక్కతో మాట్లాడిస్తున్నారని అరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ కూడా మాట్లాడారు.